Sahadev Soren | సిపిఐ మావోయిస్ట్ CPI (Maoist) సెంట్రల్ కమిటీ సభ్యుడు (CCM) సహదేవ్ సోరెన్ జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లా కారాండో అటవీప్రాంతంలో భద్రతా బలగాల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. అతడి తలపై కోటి రూపాయల బహుమతి ఉంది. అతడితో పాటు తన సహచరులు – రఘునాథ్ హెంబ్రామ్ (రూ.25 లక్షలు), బీర్సెన్ గాంఝు (రూ.10 లక్షలు) కూడా ఎన్‌కౌంటర్‌లో మరణించారు.
ఐదు రోజుల క్రితమే చత్తీస్‌గఢ్‌లో మరో సెంట్రల్ కమిటీ సభ్యుడు మోడెం బాలకృష్ణ హతమైన విషయం మరువకముందే సహదేవ్ మరణం మావోయిస్టు ఉద్యమానికి శరాఘాతంగా మారింది. ఈ వరుస ఎన్కౌంటర్లతో కేంద్ర కమిటీలో సభ్యుల సంఖ్య 13కి తగ్గింది. ప్రస్తుతం అందులో తెలంగాణకు చెందిన 9 మంది, జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు, చత్తీస్‌గఢ్‌కు చెందిన ఇద్దరు మిగిలారు.
2026 మార్చి 31లోపు మావోయిస్టు ముప్పును పూర్తిగా నిర్మూలిస్తామన్న హోం మంత్రి అమిత్ షా, ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారనడానికి ఈ ఎన్కౌంటర్లే ఉదాహరణగా నిలుస్తున్నాయి.
సహదేవ్ సోరెన్ దాదాపు మూడు దశాబ్దాలుగా మావోయిస్టు కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. 1994లోనే మొదటిసారి భద్రతా దళాలతో సహదేవ్ ముఖాముఖి తలపడ్డాడు. కానీ అతడి హత్యాకాండలు మాత్రం 2005లో ప్రారంభమయ్యాయి.
2012లో గిరిడి జైలుపై మావోయిస్టులు దాడి చేసి సహదేవ్‌ను తప్పించారు. అప్పటి నుంచి అతను బిహార్-జార్ఖండ్ సరిహద్దులో మావోయిస్టు కార్యకలాపాలను కొనసాగించాడు. పరశ్నాథ్ కొండలు, సరండా అడవుల్లో అతడికి బలమైన పట్టుంది. అతనికి భద్రతగా ఎప్పుడూ 25–30 మంది గన్‌మెన్ల రక్షణ వలయం ఉండేది.
భద్రతా బలగాల నిరంతర ఆపరేషన్ల ఫలితంగా అతడు చివరికి CoBRA కమాండోలు, స్థానిక పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో మరణించాడు. ఈ ఏడాది ఇప్పటికే ఏడుగురు మావోయిస్టులు అగ్రనేతలు హతం కాగా, ఒకరు లొంగిపోయారు. మరో అగ్రనేత యువ మావోయిస్ట్ కమాండర్ హిడ్మా అనేకసార్లు పోలీసుల దాడినుండి తృటిలో తప్పించుకున్నాడు. ఆపరేషన్ కగార్, ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్‌లతో మావోయిస్టు ఉద్యమం ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోయింది. అమిత్ షా అన్నట్లుగానే 2026 మార్చికల్లా వామపక్ష తీవ్రవాదం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.