CM Kejriwal | సుప్రీంకోర్టుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌.. సీబీఐ కేసులో బెయిల్‌ కోసం పిటిషన్‌

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సీబీఐ కేసులో బెయిల్‌ మంజూరీ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు

CM Kejriwal | సుప్రీంకోర్టుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌.. సీబీఐ కేసులో బెయిల్‌ కోసం పిటిషన్‌

విధాత, హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సీబీఐ కేసులో బెయిల్‌ మంజూరీ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తన అరెస్టు, రిమాండ్‌పై జూన్‌లో ఢిల్లీ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులు చట్టవిరుద్ధమని పిటిషన్‌లో కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పునకు ఇది వ్యతిరేకంగా ఉందని పిటిషన్‌లో తెలిపారు. దీనిపై అత్యవసర విచారణ జరపాలని కేజ్రీవాల్‌ తరపు న్యాయవాది సుప్రీం కోర్టును కోరగా తమకు మెయిల్ అభ్యర్ధన పంపాలని భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ తెలిపారు.

కాగా లిక్కర్‌ స్కామ్‌ మనీలాండరీంగ్‌ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ మార్చి 21న అరెస్టు చేసింది. తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ అలస్యమవుతుండటంతో లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం కోసం చేసిన అభ్యర్ధనను అంగీకరిస్తూ కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఎన్నికల అనంతరం ఆయన తిరిగి జైలుకు వెళ్లారు. కాగా ఈడీ అరెస్టు కేసులో సుప్రీం కోర్టు సీఎం కేజ్రీవాల్‌కు జులై 12న మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

అయితే ఇదే కేసులో సీబీఐ ఆయనను అరెస్టు చేయడంతో ప్రస్తుతం జైలులోనే కొనసాగుతున్నారు. ఇదే కేసులో మొదట అరెస్టయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఆగస్టు 9న సుప్రీం బెయిల్ మంజూరు చేసింది. కాగా రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌కు ఆరు నెలల కస్టడీ తర్వాత ఏప్రిల్ లో అత్యున్నత న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌కు కూడా సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరీ చేయవచ్చని ఆమ్‌ ఆద్మీ పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి