దీపావళి డబుల్ ధమాకా? GST స్లాబులు 4 నుంచి 2కు – కేంద్రం ప్రతిపాదన ?
కేంద్రం 4 GST స్లాబులను 2కు తగ్గించే ప్రతిపాదన తేనుందా?. 90% వస్తువులు 28% నుంచి 18% స్లాబుకు, 99% వస్తువులు 12% నుంచి 5% స్లాబుకు మారే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి.,

- GSTలో భారీ సంస్కరణ – 4 స్లాబుల నుండి 2 స్లాబులు
- దీపావళి ముందే GST నిర్మాణంలో పెద్ద మార్పులు
- 28% స్లాబ్‌లోని 90% వస్తువులు 18% స్లాబ్‌కు
GST New Slabs | దీపావళి పండుగకు డబుల్ ట్రీట్‌లా ప్రజలకు ఆనందం పంచేలా వస్తున్నట్లు కేంద్రం సంకేతాలు ఇస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనతో పాటు, వస్తు సేవల పన్ను (GST) నిర్మాణంలో పెద్ద మార్పులు తేలనున్నాయన్న సమాచారం వెలువడింది. ఇప్పటి వరకు అమలులో ఉన్న నాలుగు GST స్లాబులను కేవలం రెండు స్లాబులకు తగ్గించే ప్రతిపాదనను కేంద్రం సిద్ధం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
ఈ ప్రతిపాదన ప్రకారం, 28 శాతం పన్ను స్లాబులో ఉన్న 90 శాతం వస్తువులను 18 శాతం స్లాబుకు తరలించనున్నారు. అలాగే, 12 శాతం స్లాబులో ఉన్న 99 శాతం వస్తువులను 5 శాతం స్లాబులో చేర్చనున్నారు. లగ్జరీ మరియు ‘సిన్’ వస్తువులు — టొబాకో, గుట్కా, సిగరెట్లు వంటి 5-7 వస్తువులు మాత్రమే ప్రత్యేకంగా 40 శాతం పన్ను స్లాబులో ఉంచనున్నారు. అయితే, ఫ్రిజ్, ఎయిర్ కండీషనర్, వాషింగ్ మెషిన్ వంటి ఆకాంక్షా వస్తువులు ఈ జాబితాలో ఉండవు.
ఇంకా, పెట్రోలియం ఉత్పత్తులు ప్రస్తుత GST పరిధిలో లేనట్లుగానే కొనసాగుతాయి. వజ్రాలు, విలువైన రాళ్లు వంటి అధిక కార్మికాధారిత, ఎగుమతి కేంద్రిత రంగాలు ప్రస్తుత పన్ను రేట్లకే పన్ను చెల్లించాలి. ఈ మార్పులతో మొత్తం పన్ను భారమంతా 88 శాతం స్థాయిలోనే ఉంచుతారని కేంద్రం చెబుతోంది.
రేట్ల తగ్గింపుతో వచ్చే ఆదాయ లోటును వినియోగం పెరగడం ద్వారా భర్తీ చేయగలమని ఆర్థిక మంత్రిత్వ శాఖ లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం 18 శాతం స్లాబులో ఉన్న వస్తువుల నుంచి మొత్తం GST ఆదాయంలో 67 శాతం వస్తోంది. 28 శాతం నుంచి 11 శాతం, 12 శాతం నుంచి 5 శాతం, 5 శాతం నుంచి 7 శాతం వస్తోంది.
GST కౌన్సిల్ (రాష్ట్ర ఆర్థిక మంత్రులు కూడా సభ్యులు) ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో తీసుకునే అవకాశం ఉంది. 2017లో అమలులోకి వచ్చిన GST, దేశవ్యాప్తంగా పరోక్ష పన్ను నిర్మాణాన్ని ఏకరీకృతం చేసి చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు సౌలభ్యం కల్పించిన ప్రధాన సంస్కరణగా నిలిచింది. ఈసారి మార్పులు జరిగితే సాధారణ ప్రజలు, మధ్యతరగతి, మహిళలు, విద్యార్థులు, రైతులకు ఉపశమనం కలిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.