maharashtra, jharkhand elections । మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీలకు ఎన్నికల తేదీలు ప్రకటించిన ఈసీ
మరో ఎన్నికల సమరానికి రణభేరీ మోగింది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీలకు ఎన్నికల తేదీలు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 26తో గడవు ముగియనున్నది. జార్ఖండ్ అసెంబ్లీకి జనవరి 5తో పదవీకాలం ముగుస్తుంది.

maharashtra, jharkhand elections । మరో ఎన్నికల సమరానికి రణభేరీ మోగింది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీలకు ఎన్నికల తేదీలు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 26తో గడవు ముగియనున్నది. జార్ఖండ్ అసెంబ్లీకి జనవరి 5తో పదవీకాలం ముగుస్తుంది. మహారాష్ట్రకు ఒకే విడుతలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఈసీ ప్రకటించింది. అక్టోబర్ 22న నోటిఫికేషన్ విడుల చేస్తారు. నామినేషన్ల దాఖలుకు అక్టోబర్ 29 వరకూ అవకాశం ఇస్తారు. అక్టోబర్ 30న నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ నాలుగు వరకూ అవకాశం ఇస్తారు. నవంబర్ 20న పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ తెలిపారు. జార్ఖండ్ అసెంబ్లీకి రెండు విడుతల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. నవంబర్ 13, 20 తేదీల్లో పోలింగ్ చేపట్టి, నవంబర్ 23న ఫలితాలు ప్రకటిస్తారు.
ఇటీవలే రెండు కీలక రాష్ట్రాలైన జమ్ము కశ్మీర్, హర్యానా అసెంబ్లీలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. వీటిలో జమ్ముకశ్మీర్‌లో బీజేపీని ఓటర్లు తిరస్కరించారు. అటు హర్యానాలో అనూహ్యంగా బీజేపీ హ్యాట్రిక్ సాధించింది. హర్యానాలో గెలుపుపై అత్యాశలు పెట్టుకున్న కాంగ్రెస్‌కు భంగపాటు ఎదురైంది. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలు ఉన్నాయి. జార్ఖండ్ అసెంబ్లీలో 81 సీట్లు ఉన్నాయి. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన, ఎన్సీపీ నేతృత్వంలోని మహాయుతి, ఎన్సీపీ (ఎస్పీ), కాంగ్రెస్, శివసేన (యూబీటీ) మధ్య హోరాహోరీ పోరు సాగనున్నది. జార్ఖండ్‌లో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేతృత్వంలోని ఇండియా కూటమి భాగస్వామ్యపక్షానికి, ఎన్డీయే కూటమికి మధ్య ముఖాముఖీ పోరు జరుగనున్నది.
వాయనాడ్ సహా పలు స్థానాలకు ఉప ఎన్నికలు
రాహుల్ గాంధీ రాజీనామా చేసిన వాయనాడ్ లోక్‌సభ స్థానం, 47 అసెంబ్లీ స్థానాలకు కూడా తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీతోపాటు వాయనాడ్ నుంచీ కూడా రాహుల్ గాంధీ విజయం సాధించారు. అయితే.. రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగాలని నిర్ణయించుకున్న రాహుల్‌గాంధీ.. వాయనాడ్‌కు రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. వాయనాడ్ నుంచి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను తన అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. నవంబర్ 13న 47 అసెంబ్లీ స్థానాలతోపాటు వాయనాడ్ లోక్‌సభ సీటుకు ఉప ఎన్నికలు నిర్వహిస్తామని రాజీవ్‌కుమార్ తెలిపారు. జమ్ము కశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో ఎలాంటి హింస చోటు చేసుకోలేదని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయన్నారు. మహారాష్ట్రలో 9.63 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాజీవ్‌కుమార్ చెప్పారు. జార్ఖండ్‌లో 2.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్‌తో ఎన్నికల సంఘానికి సంబంధం లేదని రాజీవ్‌కుమార్ చెప్పారు. ఎగ్జిట్‌పోల్ ఫలితాలు ప్రకటించేవారు స్వీయ నియంత్రణ పాటించాలని ఆయన సూచించారు.