మోదీ పదేళ్ల పాలనలో చదువులు.. చట్టుబండలు!

2014లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు అరచేతిలో చంద్రుడిని చూపించారు. విద్యారంగంలో అందరికీ సమానావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేకించి బాలికల విద్యపై దృష్టి కేంద్రీకరిస్తామన్నారు

మోదీ పదేళ్ల పాలనలో చదువులు.. చట్టుబండలు!

పదేళ్ల క్రితం విద్యారంగంపై భారీ హామీలు
రెండు పర్యాయాల్లో అన్నీ హుష్‌కాకి
పాఠ్యాంశాల కాషాయీకరణపైనే దృష్టి
చరిత్రను విద్యార్థులకు దూరం చేసే యత్నం
భారీగా మూతపడిన ప్రభుత్వ స్కూళ్లు
గాలికి పోయిన చదువుకునే హక్కు చట్టం
స్కూళ్లు, వర్సిటీల్లో లక్షల్లో టీచర్‌ ఖాళీలు
స్కూళ్లలో తగ్గిపోయిన స్థూల నమోదు నిష్పత్తి
బడుగు విద్యర్థులకు ఉపకార వేతనాలు బంద్‌
విద్యారంగ బడ్జెట్‌ కేటాయింపుల్లో భారీ కోతలు
ఎఫ్‌ఏఎన్‌ ఇండియా ఎడ్యుకేషన్‌ రిపోర్ట్‌కార్డ్‌

న్యూఢిల్లీ : 2014లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు అరచేతిలో చంద్రుడిని చూపించారు. విద్యారంగంలో అందరికీ సమానావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేకించి బాలికల విద్యపై దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. లోటును పూడ్చేలా పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయుల, పరిశోధకుల నియామకాలు చేపడతామని చెప్పారు. విద్యారంగానికి జీడీపీలో ఆరు శాతాన్ని కేటాయిస్తామని ప్రగల్భాలు పలికారు. కానీ.. పదేళ్ల మోదీ పాలనలో ఇవేవీ జరుగకపోగా.. పాఠపుస్తకాలను ప్రత్యేకించి చరిత్ర, రాజనీతి శాస్త్రాలను సమూలంగా మార్చివేసి, వాటిలో హిందూత్వ భావనలు చొప్పించేందుకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారని, విద్యావకాశాలను ప్రత్యేకించి బడుగు వర్గాలకు దూరం చేశారని పౌర సమాజ సంఘాలు, సంస్థలు, ప్రజా ఉద్యమ ప్రతినిధులతో కూడిన ఫైనాన్షియల్‌ ఎక్కౌంటబిలిటీ నెట్‌వర్క్‌ ఇండియా (ఎఫ్‌ఏఎన్‌ ఇండియా) పేర్కొన్నది. ఈ మేరకు ఎడ్యుకేషన్‌ రిపోర్ట్‌కార్డ్‌ – 2014-24 పేరిట ఒక నివేదికను విడుదల చేసింది. నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ (ఎన్‌ఈపీ) 2020కి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలను పెద్ద ఎత్తున కన్సాలిడేట్‌ (పాఠశాలలను కలిపివేయడం) చేశారని, దానితో చదువుకునే హక్కు చట్టం ప్రాథమిక స్ఫూర్తి మంటగలిసి పోయిందని నివేదిక తెలిపింది.

భారీగా స్కూళ్ల మూత
‘ఒక్క 2023లోనే దేశవ్యాప్తంగా నాలుగువేల స్కూళ్లను కలిపేశారు. దీంతో అనేక మంది విద్యార్థులు ప్రభావితమయ్యారు. రెండు లక్షల మంది విద్యార్థులను ప్రభావితం చేసేలా మహారాష్ట్ర స్కూళ్ల విలీనాన్ని ప్రకటించింది. ఒడిశా 7,478 పాఠశాలలను మూసివేసింది. మధ్యప్రదేశ్‌ దాదాపు 35వేల స్కూళ్ల విలీనం చేసి 16వేల స్కూళ్లు మాత్రమే ఉంచేలా ప్రతిపాదన చేసింది. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి చర్యలతో పిల్లలకు చదువు దూరమవుతుంది. అంతేకాకుండా విద్యా హక్కు చట్టానికి తూట్లు పొడుస్తుంది’ అని నివేదిక పేర్కొన్నది. మోదీ ప్రభుత్వం విద్యాభ్యాసానికి అవకాశాలను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చింది. కానీ.. వాస్తవంలో 2018-19 నుంచి 2021-22 మధ్యకాలంలో పాఠశాలలు 15,51,000 నుంచి 14,89,115కు తగ్గిపోయాయి. అంటే 61,885 స్కూళ్లు మూతపడ్డాయి. ఇందులోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలే 61,361 ఉన్నాయి.
పెద్ద సంఖ్యలో ప్రైవేటు స్కూళ్లు వెలుస్తుండటం కూడా ప్రభుత్వ పాఠశాలలు మూతపడటానికి ఒక కారణం. దీనితో అట్టడుగు వర్గాల వారి పిల్లలకు విద్యావకాశాలు ప్రశ్నార్థకంగా మారాయి. 2014-15లో దేశవ్యాప్తంగా 11,07,118 ప్రభుత్వ స్కూళ్లు, 83,402 ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలలు ఉండేవి. 2021-22 నాటికి ఈ సంఖ్య 10,22,386, 82,480కు పడిపోయింది. అదే సమయంలో ప్రైవేటు పాఠశాలల సంఖ్య 2014-15లో 2,88,164 నుంచి 2021-22 నాటికి 3,35,844 చేరాయి. అంటే.. ఏకంగా 47,680 ప్రైవేటు స్కూళ్లు కొత్తగా పుట్టుకొచ్చాయి.
లక్షల్లో ఉపాధ్యాయ ఖాళీలు
దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల కొరతకు సంబంధించి పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదికను ఎఫ్‌ఏఎన్‌-ఇండియా నివేదికను ఉటంకించింది. దాని ప్రకారం.. రాష్ట్ర స్థాయిలో మొత్తం 62.71 లక్షల పోస్టులకు గాను పది లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పరీక్షలు రాసి, నియామక పత్రాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు ఈ కారణంగానే ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతున్నారని ఎఫ్‌ఏఎన్‌ నివేదిక పేర్కొన్నది.

క్షీణించిన స్థూల నమోదు నిష్పత్తి
స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్‌) ప్రాథమిక విద్య నుంచి హయ్యర్‌ సెకండరీ వరకూ అన్ని స్థాయిల్లో క్షీణిస్తున్నదని ఎఫ్‌ఏఎన్‌ ఇండియా రిపోర్ట్‌ కార్డ్‌ పేర్కొంటున్నది. నమోదు నిష్పత్తి ప్రాథమిక స్థాయిలో 103.39 నుంచి హయ్యర్‌ సెకండరీ స్థాయిలో 57.56కు పడిపోయిందని తెలిపింది. ఇందులో తీవ్రంగా నష్టపోయింది అట్టడుగు వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, మైనార్టీలేనని పేర్కొన్నది.

ఎస్సీల విషయంలో నమోదు నిష్పత్తి ప్రాథమిక స్థాయిలో 113.1 నుంచి సెకండరీ స్థాయిలో 84.91, హయ్యర్‌ సెకండరీ స్థాయిలో 61.49కి పడిపోయిందని ఎఫ్‌ఏఎన్‌ నివేదిక పేర్కొన్నది. మరోవైపు ఎస్టీల స్థూల నమోదు నిష్పత్తి ప్రాథమిక స్థాయిలో 106.5 నుంచి సెకండరీ స్థాయిలో 78.06కు, హయ్యర్‌ సెకండరీ స్థాయిలో 52.02కు పడిపోయిందని రిపోర్ట్‌ కార్డ్‌ వెల్లడించింది.

ఉపకార వేతనాలకు బ్రేక్‌
2022లో ఒక నుంచి ఎనిమిదో తరగతి వరకు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలను 2022-23 విద్యా సంవత్సరంలో నిలిపివేశారని తెలిపింది. అంతేకాదు.. హయ్యర్‌ ఎడ్యుకేషన్‌లో సైతం ఈ వర్గాలకు వివిధ రకాల ఉపకారవేతనాలు నిలిపివేశారు.
ఉదాహరణకు 2022లో మైనార్టీ వర్గాల్లో ఎంఫిల్‌, పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్యాభాసానికి ఎంతగానో సహకరించే మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఫాలోషిప్స్‌ ఫర్‌ మైనార్టీస్‌ను మోదీ ప్రభుత్వం ఆపివేసింది. ప్రతిభ ఆధారంగా వివిధ రకాల ప్రొఫెషనల్‌, టెక్నికల్‌ కోర్సులకు స్కాలర్‌షిప్‌లు ఇచ్చేందుకు ఉద్దేశించిన బడ్జెట్‌ కేటాయింపులను గణనీయంగా తగ్గించేశారు. 2013-14లో అది 243 కోట్లు ఉంటే.. 2024-25 నాటికి 33.80 కోట్లకు కుదించారని నివేదిక పేర్కొన్నది. ఉన్నత విద్యారంగంలో దుస్థితిని వివరిస్తూ.. లోక్‌సభలో ప్రభుత్వం ఇచ్చిన ఒక సమాధానాన్ని ఎఫ్‌ఏఎన్‌ ఇండియా నివేదిక ప్రస్తావించింది. ఆ సమాధానం ప్రకారం.. దేశవ్యాప్తంగా 45 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 32 శాతం, ఐఐటీల్లో 40 శాతం, ఐఐఎంలలో 31.6 శాతం టీచింగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
విద్యారంగంపై కేటాయింపులు పెంచుతామని మోదీ చేసినవాగ్దానాల డొల్లతనాన్ని చాటిన ఎఫ్ఏఎన్‌ నివేదిక.. పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖకు 2013-14 బడ్జెట్‌లో 3.16 శాతం కేటాయింపులు ఉంటే.. 2024-25 నాటికి దాన్ని 1.53 శాతానికి కుదించారని తెలిపింది.
విద్యారంగానికి తగ్గిపోయిన కేటాయింపులు
‘ఉన్నత విద్యారంగానికి కూడా కేటాయింపులు దారుణంగా తగ్గిపోయాయి. 2013-14లో 1.6 శాతం ఉంటే.. 2024-25 బడ్జెట్‌లో దాన్ని 1 శాతానికి పరిమితం చేశారు’ అని నివేదిక పేర్కొన్నది.
ఇక ఈ పదేళ్లలో మోదీ ప్రభుత్వం చేసిందేమన్నా ఉన్నదీ అంటే అది విద్యారంగాన్ని కాషాయీకరించడమేనని ఎఫ్‌ఏఎన్‌ నివేదిక స్పష్టం చేసింది. మహాత్మా గాంధీ హత్యలో హిందూత్వ సంస్థల పాత్ర, ఆరెస్సెస్‌పై నిషేధం విధింపు, 2002లో గుజరాత్‌ మత ఘర్షణలు, వంటి అనేక చారిత్రక వాస్తవాలను ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశాల నుంచి మోదీ సర్కార్‌ తొలగించిందని నివేదిక పేర్కొన్నది.
గత ఏడాది 2023లో పాఠ్యపుస్తకాల అభివృద్ధి కమిటీలో ఉన్న దాదాపు 33 మంది విద్యావేత్తలు ఎన్సీఈఆర్టీ డైరెక్టర్‌ దినేశ్‌ సక్లానీకి ఒక లేఖ రాస్తూ.. ప్రస్తుత పాఠ్య పుస్తకాల నుంచి తమ పేర్లను తొలగించాలని డిమాండ్‌ చేయడం గమనార్హం. ‘హేతుబద్ధీకరించిన’ రాజనీతి శాస్త్రం పాఠ్యపుస్తకాలతో తమకు సంబంధం లేదని ప్రముఖ రాజకీయ శాస్త్రవేత్త యోగేంద్రయాదవ్‌, సుహాస్‌ పాల్‌శిఖర్‌ ప్రకటించిన కొద్ది రోజులకే సదరు విద్యావేత్తలు లేఖ రాయడం గమనార్హం.
విద్యా కాషాయీకరణపైనే దృష్టి
‘మొఘల్‌ చక్రవర్తుల కాలం, గతకాలపు ముస్లిం రాజుల పాలనకు సంబంధించిన అంశాలను గణనీయంగా తగ్గించి వేశారు. ఆరు నుంచి 12 వ తరగతి పొలిటికల్‌ సైన్స్‌ పుస్తకాల్లో నర్మదా బచావ్‌ ఆందోళన్‌ సహా పలు కీలక అంశాలపై సాగిన నిరసనలకు సంబంధించిన మూడు అధ్యాయాలను తొలగించివేశారు. కుల వివక్షపై అంశాలు, దళిత కార్యకర్తలు, కవులు రాసిన అంశాలు, మత సామరస్యానికి సంబంధించిన అంశాలను తొలగించారు’ అని ఎఫ్‌ఏఎన్‌ ఇండియా నివేదిక వెల్లడించింది.