ప్యాసింజర్ రైలులో మంటలు.. ప‌లువురు ప్ర‌యాణికుల‌కు గాయాలు

దేశ‌వ్యాప్తంగా రైలు ప్ర‌మాదాలు ఇటీవ‌ల నిత్య‌కృతంగా మారాయి. తాజాగా మ‌రో రైలులో మంట‌లు చెలరేగాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో గురువారం అర్ధ‌రాత్రి దాట‌క ఈ ప్ర‌మాదం చోటుచేసుకున్న‌ది.

ప్యాసింజర్ రైలులో మంటలు.. ప‌లువురు ప్ర‌యాణికుల‌కు గాయాలు
  • యూపీలోని ఇటావాలో అర్ధ‌రాత్రి దాటాక ఘ‌ట‌న‌
  • వ‌రుస రైలు ప్ర‌మాదాల‌తో ప్ర‌యాణికుల బెంబేలు

విధాత‌: దేశ‌వ్యాప్తంగా రైలు ప్ర‌మాదాలు ఇటీవ‌ల నిత్య‌కృతంగా మారాయి. తాజాగా మ‌రో రైలులో మంట‌లు చెలరేగాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో గురువారం అర్ధ‌రాత్రి దాట‌క ఈ ప్ర‌మాదం చోటుచేసుకున్న‌ది. పోలీసుల వివ‌రాల ప్ర‌కారం.. ఢిల్లీ-సహారసా వైశాలి ఎక్స్‌ప్రెస్ గురువారం తెల్లవారుజామున 2:40 గంటలకు ఫ్రెండ్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతం మీదుగా వెళ్తున్న‌ప్పుడు ప్యాసింజర్ రైలు కోచ్‌లో మంటలు చెలరేగాయి.


ఈ ఘ‌ట‌న‌లో ప‌లువురు ప్ర‌యాణికుల‌కు గాయాల‌య్యాయి. క్ష‌త‌గాత్రుల‌ను పోలీసులు స‌మీప ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని రైలులోని ఎస్-6 కోచ్‌లో మంటలను ఆర్పివేసినట్టు పోలీసులు తెలిపారు. మంట‌లు చెల‌రేగ‌డానికి గ‌ల కార‌ణాలు ఇంకా తెలియ‌రాలేద‌ని రైల్వే అధికారులు వెల్ల‌డించారు.


బుధవారం సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో న్యూఢిల్లీ-దర్భంగా స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలులో కూడా మంటలు చెలరేగాయి. మూడు కోచ్‌లు దెబ్బతిన్నాయి. ఎనిమిది మంది ప్రయాణికులు గాయపడినట్టు అధికారులు తెలిపారు. బుధ‌వారం నాటి ప్ర‌మాద ఘ‌ట‌న మరువ‌క ముందే గురువారం తెల్ల‌వారుజామున మ‌రో రైలులో మంట‌లు చెల‌రేగ‌డంతో ప్ర‌యాణికులు బెంబేలెత్తున్నారు.