కుల్గామ్ ఎన్‌కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో శుక్రవారం భద్రతా బలగాల ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు

- చివరి దశలో సెర్చ్ ఆపరేషన్
విధాత: జమ్ముకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో శుక్రవారం భద్రతా బలగాల ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆపరేషన్ చివరి దశలో ఉన్నదని, హతమైన ఉగ్రవాదులు ఎవరనేది నిర్ధారిస్తున్నామని అధికారులు తెలిపారు. “కుల్గామ్‌లో సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా రెండో రోజైన శుక్రవారం పోలీసులు, ఆర్మీ, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది జరిపిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనా స్థలం నుంచి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాం. ఆపరేషన్ చివరి దశలో ఉన్నది. మరణించిన ఉగ్రవాదుల ఆచూకీ తెలుసుకుంటున్నాం. ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు ఉన్నారా? అని ఈ ప్రాంతాన్ని మొత్తం జల్లెడ పడుతున్నాం” అని కశ్మీర్ జోన్ పోలీసులు X లో వెల్లడించారు.
జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుల్గాం జిల్లాలోని డిహెచ్ పోరా ప్రాంతంలోని సామ్నో పాకెట్ వద్ద ఉగ్రవాదులు ఉన్నట్టు గురువారం పోలీసులకు సమాచారం అందింది. గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదులపై జాయింట్ ఆపరేషన్‌లో ఆర్మీకి చెందిన 34 రాష్ట్రీయ రైఫిల్స్, 9 పారా (ఎలైట్ స్పెషల్ ఫోర్స్ యూనిట్), పోలీసులు, సీఆర్‌పీఎఫ్ దళాలు పాల్గొన్నాయి. రాత్రి సమయంలో గ్రామాన్ని చుట్టుముట్టారు. ఎన్‌కౌంటర్ సైట్ సమీపంలో లైట్లు ఏర్పాటు చేశారు. రాత్రి వేళ ఆపరేషన్‌ను నిలిపివేసినట్టు అధికారులు తెలిపారు.
శుక్రవారం తెల్లవారుజామున మళ్లీ ఎదురుకాల్పులు జరిగినట్టు అధికారులు తెలిపారు. ఎదురుకాల్పుల్లో ఉగ్రవాదులు దాక్కున్న ఇంట్లో మంటలు చెలరేగడంతో ఉగ్రవాదులు బయటకు వచ్చేశారు. ఆ ప్రాంతాన్ని పరిశీలించగా, ఐదుగురు ఉగ్రవాదుల మృతదేహాలు లభించాయని అధికారులు పేర్కొన్నారు. సెప్టెంబర్ 13న అనంత్‌నాగ్‌లోని గారోల్ అడవుల్లో వారం రోజుల పాటు జరిగిన ఆపరేషన్‌లో నలుగురు భద్రతా దళాల సిబ్బంది అసువులుభాసారు. ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. నాటి నుంచి దక్షిణ కాశ్మీర్‌లో జరిగిన ఇది అతిపెద్ద ఉగ్రవాద ఆపరేషన్ ఇదే కావడం విశేషం.