Wayanad | శిథిలమైన ఇంట్లోనే మూడు రోజులుగా!నలుగురు వ్యక్తులను కాపాడిన ఆర్మీ సిబ్బంది

కొండచరియలు విడిగినపడిన వాయనాడ్‌ జిల్లాలో మారుమూల ప్రాంతంలోని మునక్కాయి గ్రామంలో ఒక ఇంటిలో మూడు రోజులుగా చిక్కుకుపోయి ఉన్న ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలను ఆర్మీ సిబ్బంది కాపాడారు.

Wayanad | శిథిలమైన ఇంట్లోనే మూడు రోజులుగా!నలుగురు వ్యక్తులను కాపాడిన ఆర్మీ సిబ్బంది

వాయనాడ్‌లో 319కి పెరిగిన మృతులు

వాయనాడ్‌ : కొండచరియలు విడిగినపడిన వాయనాడ్‌ జిల్లాలో మారుమూల ప్రాంతంలోని మునక్కాయి గ్రామంలో ఒక ఇంటిలో మూడు రోజులుగా చిక్కుకుపోయి ఉన్న ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలను ఆర్మీ సిబ్బంది కాపాడారు. వారిని వారి బంధువు ఇంటికి తరలించారు. వారిలో ఒక మహిళ కాలికి గాయమైందని ఆర్మీ కమాండర్‌ వీటీ మాథ్యూ చెప్పారు. వారిని ముండక్కాయిలోని పడవెట్టికున్ను గ్రామానికి చెందిన జాను, జోముల్‌, అబ్రహాం మాథ్యూ, క్రిస్టీగా గుర్తించారు. వారు మారుమూల ప్రాంతంలోని ఇంటిలో చిక్కుకుపోయారని, అయితే శిథిలాల కింద చిక్కుకొని లేరని ఆర్మీ కమాండర్‌ తెలిపారు. శుక్రవారం ఉదయం వీరి గురించి సమాచారం అందిన వెంటనే సహాయ బృందాలు అక్కడికి చేరుకుని వారిని కాపాడాయి. ‘వారు ఉన్న ఇంటికి కుడివైపు కొండచరియ విరిగిపడటంతో మొత్తం కొట్టుకుపోయింది. అయితే.. ప్రమాదం తొలగిపోయిందని భావించిన వారు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. వారి వద్ద పెంపుడు జంతువులు కూడా ఉన్నాయి. చుట్టుపక్కల ఎవరూ లేకపోయినా.. వారు అక్కడే ఉండిపోయారు’ అని అధికారులు తెలిపారు. వారికి నచ్చజెప్పిన సహాయ సిబ్బంది.. వారిని అక్కడి నుంచి తరలించారు.
ఇదిలాఉంటే.. శిథిలాల కింద చిక్కుకుపోయిన మృతదేహాలను గుర్తించేందుకు ఉపకరించే డ్రోన్‌ ఆధారిత రాడార్‌ను ఢిల్లీ నుంచి వాయనాడ్‌కు తీసుకొచ్చారు. సహాయ చర్యల్లో సహకరించేందుకు గాను మృతదేహాలను గుర్తించే నాలుగు జాగిలాలను కూడా చెన్నై నుంచి వాయనాడ్‌కు తెప్పిస్తున్నారు.
మొత్తం ఆరు ప్రభావిత ప్రాంతాల్లో మృతదేహాలను వెలికి తీసేందుకు అధికారులు శుక్రవారం 40 సెర్చ్‌ టీమ్‌లను ఏర్పాటు చేశారు. దీనితోపాటు చలియార్‌ నదిలో కొట్టుకుపోయిన మృతదేహాలను వెలికితీసేందుకు ప్రత్యేక సెర్చ్‌ ఆపరేషన్‌ కూడా కొనసాగుతున్నది. ఇందుకోసం స్థానిక గజ ఈతగాళ్లను రంగంలోకి దింపారు. ఈ మొత్తం ఆపరేషన్‌ను నది వెంబడి 40 కిలోమీటర్ల వరకూ ఉన్న 8 పోలీస్‌ స్టేషన్‌ల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటి వరకూ వాయనాడ్‌ ప్రకృతి బీభత్సంలో చనిపోయినవారి సంఖ్య 319కి చేరుకున్నది.