నడిరోడ్డుపై మహిళా యోగా.. జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు

ప్రస్తుతం డిజిటల్ మీడియా యుగం నడుస్తోంది.. ఈ డిజిటల్ యుగంలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవాలనే లక్ష్యంతో.. చాలా మంది వివిధ రకాల స్టంట్లకు పాల్పడుతుంటారు. ఇటీవలే ఓ మహిళ గ్యాస్ సిలిండర్‌ను నెత్తిపై పెట్టుకుని, డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. న్యూయార్క్‌కు చెందిన ఓ యువకుడు తలపై ఫ్రిడ్జ్ పెట్టుకుని, వేగంగా సైకిల్ తొక్కిన దృశ్యాలు కూడా నెట్టింట్ వైరల్ అయ్యాయి. తాజాగా ఓ మహిళ నడిరోడ్డుపై యోగా చేసి సోషల్ మీడియాలో వైరల్ కావాలనుకుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
గుజరాత్‌కు చెందిన డైనా పర్మార్ అనే ఓ మహిళ ఎంతో కాలం నుంచి యోగా నేర్చుకుంటుంది. ఇక ప్రతి రోజు ఇంట్లోనే యోగా చేస్తుంది. కానీ ఈసారి వినూత్నంగా ఆలోచించింది. నడిరోడ్డుపై యోగా భంగిమలు సృష్టించి, సోషల్ మీడియాలో వైరల్ కావాలనుకుంది. కానీ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది.
డైనా పర్మార్ ఎరుపు రంగు దుస్తులు ధరించి, నడిరోడ్డుపై వాలిపోయింది. ఇంకేముంది అక్కడ యోగాసానాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసింది. పర్మార్ యోగా చేస్తుండటంతో.. ఎక్కడి వాహనాలు అక్కడ ఆగిపోయాయి. ఈ దృశ్యం ట్రాఫిక్ పోలీసుల కంట పడింది. ఇంకేముంది పర్మార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన డైనాకు పోలీసులు జరిమానా విధించారు. ఈ సందర్భంగా పర్మార్ క్షమాపణ చెప్పారు. ఇక నుంచి ట్రాఫిక్ నిబంధనలకు కట్టుబడి ఉంటానని, ఇలాంటి స్టంట్లు మరోసారి చేయనని డైనా పర్మార్ స్పష్టం చేసింది.