కెనడాపై ఎఫ్ఏటీఎఫ్‌ను ఆశ్రయించనున్న భారత్..

ఖలిస్థానీ (Khalistans in Canada) సానుభూతిపరులకు స్థావరంగా మారిన కెనడాపై బారత్ (India) వివిధ మార్గాల్లో పోరాడటానికి నిర్ణయించుకుంది. ఇప్పటికే ఇక్కడ అధికంగా ఉన్న ఆ దేశ దౌత్యవేత్తలను వెనక్కి పిలవాలని హుకుం జారీ చేయగా.. కెనడాకు చెందిన 41 మంది అధికారులు ఇటీవలే భారత్‌ను వీడారు. తాజాగా ఉగ్రవాదులకు నిధులు అందకుండా వాచ్‌డాగ్‌లా పనిచేసే అంతర్జాతీయ సంస్థ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్)ను ఆశ్రయించాలని భారత ప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడాలో ఆశ్రయం ఇస్తున్నారని, వారికి నిధులు అందేలా పరిస్థితులను చక్కబెడుతున్నారని పేర్కొంటూ ఎఫ్ఏటీఎఫ్‌కు భారత్ ఫిర్యాదు చేయనుంది. ఈ ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే దృఢమైన , తిరుగులేని సాక్ష్యాలను కెనడాకు ఇచ్చినప్పటికీ ఆ దేశం ఎటువంటి చర్యలూ చేపట్టడం లేదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు బహిరంగంగా వెల్లడించింది. ఆ పాత సాక్ష్యాలతో పాటు కొత్తగా సేకరించిన సమాచారాన్ని ఎఫ్ఏటీఎఫ్ (FATF) కు అందించడానికి ప్రణాళిక వేస్తోంది. భారత్‌కు వ్యతిరేకంగా పనిచేసే ముఠాలకు నిధులు అందిస్తూ ఆ విషయంపై ఎవరి దృష్టీ పడకుండా ఉండటానికి తిరిగి మనపైనే కెనడా ఆరోపణలు చేస్తోందని ఒక దౌత్యాధికారి వ్యాఖ్యానించినట్లు జాతీయ మీడియా ఉటంకించింది.
అంతర్జాతీయ నిబంధనల ప్రకారం చూసుకుంటే ఈ వ్యవహారాన్ని చక్కదిద్దే బాధ్యత, అధికారం ఎఫ్ఏటీఎఫ్‌పైనే ఉందని.. దానిని ఆశ్రయించడం తప్ప వేరే మార్గం లేదని భారత్ భావిస్తోంది. గతవారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై.శంకర్ సైతం ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సూచనలు చేశారు. కెనడాలోని కొన్ని రాజకీయ వర్గాలు తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ‘కెనడాకు వ్యతిరేకంగా భవిష్యత్తులో భారత్ మరిన్ని సాక్ష్యాలను బహిర్గతం చేస్తుంది. మేము ఆ దేశ దౌత్యవేత్తలను ఎందుకు పంపేశామో అప్పుడు ప్రపంచానికి అర్థమవుతుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.