Justice Yashwant Varma | జస్టిస్ వర్మను తొలగించాలన్న సుప్రీంకోర్టు ప్యానెల్..
‘ఈ విషయంలో ఏదైనా కుట్ర జరిగి ఉంటే ఆయన హైకోర్టు చీఫ్ జస్టిస్ లేదా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎదుట ఎందుకు ఫిర్యాదు చేయలేదని సందేహాన్ని వ్యక్తం చేసింది. ఇది తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికి జరిగిన కుట్ర అని జస్టిస్ వర్మ చెప్పడాన్ని కమిటీ తిరస్కరించింది.

Justice Yashwant Varma | జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో బయటపడిన నోట్ల కట్టలను అనేక మంది చూశారని, కానీ.. ఆయన ఆ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేయలేదని విచారణ కమిటీ పేర్కొన్నది. న్యాయ అధికారులకు సైతం ఆయన ఈ విషయంలో సమాచారం ఇవ్వలేదని తెలిపింది. జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టలు బయటపడిన విషయంలో విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ఈ ప్యానెల్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు జడ్జి ప్రవర్తన అసహజంగా ఉన్నదన్న కమిటీ.. ఆయనను తొలగించాలని సిఫారసు చేసింది. ఆయనపై వచ్చిన ఆరోపణలకు తగిన ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. అక్కడ పెద్ద మొత్తంలో కరెన్సీ నోట్లు (కొన్ని సగం కాలిపోయినవి) ఉన్నాయన్న విషయంలో సాక్షుల వాంగ్మూలాలు తీసుకున్నామని, అక్కడ నోట్ల కట్టలకు సంబంధించిన విజువల్ ఆధారాలు కూడా సేకరించామని తెలిపింది. ఈ విషయంలో ఆయన ఫిర్యాదు చేయడంలో వైఫల్యాన్ని, ఆయన అనైతిక ప్రవర్తనను కమిటీ ప్రస్తావించింది.
ఈ ఘటనలో జస్టిస్ వర్మ కుమార్తె సహా మొత్తం 55 మంది సాక్షులను ప్యానెల్ విచారించింది. అగ్నిమాపక, పోలీసు సిబ్బంది నుంచి వాంగ్మూలాలు తీసుకున్నది. సగం కాలిపోయి ఉన్న నోట్లు సహా పెద్ద మొత్తంలో ఆ గదిలో పడి ఉన్న కరెన్సీ నోట్ల తాలూకు ఛాయా చిత్రాలు, వీడియోలను పరిశీలించింది. ‘ఇంత మొత్తంలో నగదును నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. వాటిని చూసి ఆశ్చర్యానికి గురయ్యాను’ అని ఒక సాక్షి విచారణ కమిటీకి చెప్పారు. ఇంత జరిగినా జస్టిస్ వర్మ కానీ, ఆయన కుటుంబీకులు కానీ ఈ విషయాన్ని పోలీసులకు లేదా సీనియర్ న్యాయ అధికారులకు తెలియజేయలేదు. ఈ విషయంలో తనకేమీ తెలియదని జస్టిస్ వర్మ చెప్పడం నమ్మశక్యంగా లేదని ప్యానెల్ పేర్కొన్నది.
ఆయన ఎలాంటి ఆమోదయోగ్యమైన వివరణ ఇవ్వలేదని తెలిపింది. ‘ఈ విషయంలో ఏదైనా కుట్ర జరిగి ఉంటే ఆయన హైకోర్టు చీఫ్ జస్టిస్ లేదా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎదుట ఎందుకు ఫిర్యాదు చేయలేదని సందేహాన్ని వ్యక్తం చేసింది. ఇది తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికి జరిగిన కుట్ర అని జస్టిస్ వర్మ చెప్పడాన్ని కమిటీ తిరస్కరించింది. ‘కరెన్సీ నోట్లను అనేక మంది చూశారు. ఆ సమయంలో వాటిని చిత్రీకరించారు. తనపై కుట్రపూరితంగా చేశారనడం నమ్మశక్యంగా లేదు’ అని కమిటీ స్పష్టం చేసింది. ఆయన ప్రైవేటు కార్యదర్శి రాజిందర్ సింగ్ కర్కీ, ఆయన కుమార్తె దియా వర్మ ఆ ప్రాంతాన్ని క్లీన్ చేయడం ద్వారా సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించారని తెలిపింది. సుమారు ఒకటిన్నర అడుగుల ఎత్తున కరెన్సీ నోట్లు ఉన్నాయని పేర్కొన్నది. తన నివాసంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో నోట్ల కట్టలు బయటపడిన నేపథ్యంలో తిరిగి అలహాబాద్ హైకోర్టుకు జస్టిస్ వర్మను తిరిగి బదిలీ చేసినప్పటికీ.. ఆయనకు ఎలాంటి విధులు అప్పగించలేదు.