ఎంపీలో నాలుగు సీట్ల‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థుల మార్పు

కాంగ్రెస్ కిందిస్థాయి కార్యకర్తల తీవ్ర వ్యతిరేక ప్రదర్శనల అనంతరం మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో నాలుగు సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులను పార్టీ అధిష్ఠానం మార్చింది. సుమౌళి, పిపరీయా, బడ్ నగర్, జావొరా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ మార్పులు జరిగాయి

ఎంపీలో నాలుగు సీట్ల‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థుల మార్పు

భోపాల్ : కాంగ్రెస్ కిందిస్థాయి కార్యకర్తల తీవ్ర వ్యతిరేక ప్రదర్శనల అనంతరం మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో నాలుగు సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులను పార్టీ అధిష్ఠానం మార్చింది. సుమౌళి, పిపరీయా, బడ్ నగర్, జావొరా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ మార్పులు జరిగాయి. బడ్ నగర్ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం కొత్తగా మురళి మోర్వాల్‌ను కాంగ్రెస్ ప్రకటించింది. ఆయ‌న అభిమానులు మంగ‌ళ‌వారం భోపాల్ లోని క‌మ‌ల్‌నాథ్ ఇంటి ముందు పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రదర్శనలకు, ఆందోళనలకు దిగారు.

కాంగ్రెస్ ఎన్నికల కమిటీ పరిస్థితిని గమనించి, ముందుగా ప్రకటించిన రాజేంద్ర సింగ్ సోలంకీని తొలగించి, అక్క‌డ మురళీ మోర్వాల్‌కు అవ‌కాశం ఇచ్చారు. నర్మదాపురం జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ సీటు నుండి గురుచరణ్ ఖేరే స్థానంలో వీరేంద్ర బెల్ వంశీని ఎంపిక చేశారు. మురైనా జిల్లాలోని సుమావళి సీట్ నుండి కుల్దీప్ సికర్వార్ బ‌దులు సిటింగ్ ఎమ్మెల్యే అజబ్ సింగ్ కుశ్వాహాను తమ అభ్యర్థిగా కాంగ్రెస్ బుధవారం ప్రకటించింది. రత్లామ్ జిల్లాలోని మరొక సీటు అయిన జావోరా నుండి ముందుగా హిమ్మత్ శ్రీమల్ ను కాంగ్రెస్ అభ్యర్ధిగా ప్రకటించింది.

తర్వాత ఆయనను తొలగించి వీరేంద్ర సింగ్ సోలంకిని ప్రకటించింది. ఈ మార్పులతో ప్రస్తుతం రాష్ట్రంలోని 230 సీట్లు గాను కాంగ్రెస్ మొత్తం అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. బీజేపీ 228 నియోజకవర్గాలకు మాత్రమే ప్రకటించింది. ఇంకా రెండు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అక్టోబరు 30వ తేదీలోపు అభ్యర్థులు నామినేషన్ దాఖ‌లు చేయాల్సి ఉన్న‌ది. 230 సీట్లు ఉన్న మధ్యప్రదేశ్ ఎన్నికలు నవంబర్ 17న జరగనున్నవి. ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న ప్రకటిస్తారు.