Parliament । ఓం బిర్లాను కలిసిన రాహుల్‌.. ధన్‌కర్‌పై ఖర్గే నిప్పులు

రాజ్యసభ సజావుగా సాగకపోవడానికి అసలు కారణం చైర్‌పర్సన్‌ జగ్దీప్‌ ధన్‌కర్‌ అని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.

Parliament । ఓం బిర్లాను కలిసిన రాహుల్‌.. ధన్‌కర్‌పై ఖర్గే నిప్పులు

Parliament । తనపై బీజేపీ సభ్యులు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ బుధవారం స్పీకర్‌ ఓం బిర్లాను కలిసి విజ్ఞప్తి చేశారు. హంగేరియన్‌- అమెరికన్‌ వ్యాపారవేత్త జార్జ్‌ సోరోస్‌తో రాహుల్‌ గాంధీకి సంబంధాలు ఉన్నాయని బీజేపీ సభ్యలు నిశికాంత్‌ దూబే, సంబిత్‌ పాత్ర ఆరోపించిన విషయం తెలిసిందే. రాజ్యసభ చైర్మన్‌ జగ్దీప్‌ ధన్‌కర్‌పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ఇచ్చిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకున్నది. ఈ అంశాన్ని పరిశీలిస్తానని ఓం బిర్లా హామీ ఇచ్చారని రాహుల్‌ అనంతరం మీడియాకు తెలిపారు. సభ నడవాలని, చర్చలు జరగాలని కాంగ్రెస్‌ పార్టీ కోరుకుంటున్నదని ఆయన అన్నారు. ‘కాంగ్రెస్‌ చేయి సోరోస్‌ చేతిలో ఉన్నది. ఓసీసీఆర్పీతో కాంగ్రెస్‌కు సంబంధాలు ఉన్నాయి. ఈ సంస్థకు అమెరికా ప్రభుత్వం నుంచి, జార్జ్‌ సోరోస్‌ నుంచి నిధులు అందుతున్నాయి. భారత్ జోడో యాత్ర కోసం జార్జ్‌ సోరోస్‌ నుంచి రాహుల్‌ గాంధీ డబ్బు తీసుకున్నారా?’ అని దూబే ప్రశ్నించారు. దీనిపై రాహుల్‌ గాంధీ బుధవారం స్పందిస్తూ ‘వాళ్లు నా గురించి ఏ మాట్లాడినప్పటికీ.. డిసెంబర్‌ 13న చర్చ జరగాలని మేం కోరుకుంటున్నాం’ అన్నారు. అదానీ అంశంపై చర్చించాలని కేంద్ర ప్రభుత్వం కోరుకోవడం లేదని విమర్శించారు.

ఇదిలా ఉంటే.. ధన్‌కర్‌ చర్యలు భారతదేశ ప్రతిష్ఠను దెబ్బతీసేవిగా ఉన్నాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో విమర్శించారు. ఇది తమ వ్యక్తిగత అంశం కాదని అన్నారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టక తప్పలేదని చెప్పారు. ‘మేం ఇప్పటికే నోటీసు ఇచ్చాం. అత్యంత సున్నితమైన ఈ అంశంపై మాట్లాడేందుకు ప్రతిపక్షం ఐక్యంగా ఇక్కడ ఉన్నది’ అని ఖర్గే చెప్పారు. గత మూడేళ్లుగా కీలక అంశాలను లేవనెత్తేందుకు సమయం కానీ, అవకాశం కానీ ధన్‌కర్‌ ఇవ్వలేదన్నారు. దీంతో ప్రతిపక్షానికి మరో మార్గం లేకపోయిందని చెప్పారు. చైర్‌పర్సన్‌ తమను రక్షిస్తారని ఆశిస్తే.. ఆయన మాత్రం అధికార పార్టీ ఎంపీలు మాట్లాడాలని సైగలు చేస్తుంటారని విమర్శించారు. హెడ్‌ మాస్టర్‌లా ఎంపీలను అదుపు చేస్తూ ప్రతిపక్ష నాయకులను అవమానించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని నిప్పులు చెరిగారు. అసలు.. చైర్‌పర్సనే రాజ్యసభకు అతిపెద్ద అడ్డంకి అని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిలా ధన్‌కర్‌ పనిచేస్తున్నారని ఆరోపించారు.