మురికి రాజకీయ క్రీడలో బీజేపీ..ఒక్క బీజేపీ నేత ఇంట్లోనూ ఈడీ సోదాలు ఎందుకు లేవు?

- తుగ్లక్‌ను తలపిస్తున్న కేంద్రం పాలన
- చరిత్రను మార్చే ప్రయత్నాలు
- బెంగాల్ సీఎం మమత విమర్శ
కోల్‌కతా: ప్రతిపక్ష నాయకులపై ఈడీ సోదాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆడుతున్న మురికి రాజకీయ క్రీడగా పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ అభివర్ణించారు. ఇంత మంది ప్రతిపక్ష నాయకుల ఇళ్లలో సోదాలు చేస్తున్న ఈడీ.. ఒక్కరంటే ఒక్క బీజేపీ నాయకుడి జోలికి ఎందుకు పోవడం లేదని నిలదీశారు. కాలికి గాయం నుంచి కోలుకుంటున్న మమతాబెనర్జీ.. గురువారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీవంటి పనికిమాలిన పనులతో తుగ్లక్ పాలనను తలపిస్తున్న బీజేపీ.. ఈ దేశ చరిత్రను మార్చివేసేందుకు ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్కూలు పాఠ్యపుస్తకాల్లో ఇండియా స్థానంలో భారత్ అని మార్చాలని ఎన్‌సీఈఆర్టీ చేసిన ప్రతిపాదనపైనా ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్ అని చెబుతున్న బీజేపీ.. నిజానికి సబ్ కా సాథ్ సబ్‌కా సత్యనాశ్ చేస్తున్నదని విమర్శించారు. రేషన్ పంపిణీ కేసులో బెంగాల్ మంత్రి జ్యోతిప్రియ మాలిక్, మరికొందరి నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. పరీక్ష పత్రాల లీకేజీ కేసులో మనీలాండరింగ్ అభియోగాలపై రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతాస్రాకు చెందిన జైపూర్, సికార్ నివాసాల్లోనూ ఈడీ అధికారులు సోదాలు చేశారు.
ఏమిటీ అకృత్యాలు? ఏమిటీ అన్యాయాలు? అని ఆమె ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుల నివాసాలపై ఈడీ సోదాల పేరుతో బీజేపీ మురికి క్రీడ ఆడుతున్నదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఒక్క బీజేపీ నేత నివాసంపైనైనా ఒక్కటంటే ఒక్కసారి సోదాలు జరిగాయా? అని ఆమె సూటిగా ప్రశ్నించారు. జ్యోతిప్రియ ఆరో గ్యం బాగోలేదని, కోల్‌కతాలోని నివాసాల్లో తనిఖీల సందర్భంగా ఆయనకు ఏం జరిగినా బీజేపీ, ఈడీ పై పోలీస్ కేసులు పెడతామని మమత హెచ్చరించారు.