భారత్‌కు తిరిగిరానున్న 1414 అపురూప విగ్రహాలు

స్మగ్లింగ్ ద్వారా విదేశాలకు తరలిపోయిన భారతీయ పురాతన విగ్రహాలు (Antiquities) , వస్తువులను తిరిగి రప్పించడానికి భారత్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అమెరికా (America) మూడు నెలల క్రితం అలాంటి 105 అపురూప విగ్రహాలను తిరిగి పంపగా.. తాజాగా న్యూయార్క్ మెట్రోపాలిటన్ మ్యూజియం (ఎంఈటీ) మరో 1414 విగ్రహాలను మనకు స్వాధీనం చేయడానికి అంగీకరించింది. వీటిని ఇప్పటికే అక్కడి భారత కాన్సులేట్ జనరల్‌కు అందించినట్లు విశ్వసనీయ సమాచారం.
ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఇది వరకే అక్కడి మ్యూజియంలలో పర్యటించి.. భారత్‌కు చెందిన విగ్రహాలను గుర్తించింది. అనంతరం అవి ఇక్కడివేననడానికి రుజువులు, చోరీ కాబడినట్లు సాక్ష్యాలను అక్కడి అధికారులకు సమర్పించింది. ప్రభుత్వ స్థాయిలో సంప్రదింపుల అనంతరం ఈ స్వాధీన ప్రక్రియ ఒక కొలిక్కివచ్చినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది. అయితే ఈ 1414 విగ్రహాల వయసు, కాలం, చోరీ కాబడిన ప్రదేశాల గురించి అటు ఎంఈటీ కానీ ఏఎస్ఐ కానీ ప్రకటన చేయలేదు.
ఎంఈటీ కి సంబంధించి అక్కడున్న భారతీయ వస్తువుల డొంకను భారత్ కదిలించింది. ఇక్కడి నుంచి చోరీ చేసి వాటిని మ్యూజియంకు విక్రయించిన వ్యక్తిని సుభాష్ కపూర్‌గా గుర్తించింది. అతడిపై ఆరోపణలు రుజువు కావడంతో ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అనంతరం ఈ ఏడాది మార్చి 22న న్యూయార్క్ సుప్రీం కోర్టు ఎంఈటీపై వారెంట్ జారీ చేసంది. 10 రోజుల్లోగా అక్రమంగా కొనుగోలు చేసిన విగ్రహాలను వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. తదనుగుణంగానే విడతల వారీగా మనకు విగ్రహాలను స్వాధీనం చేస్తూ వస్తోంది.