మరి నిఠారీ హత్యలు చేసిందెవరు?.. నిర్దోషిగా బయటకు వచ్చిన పంధేర్

- నిందితుడు మొయిందర్ పంధేర్ విడుదల
- ఆరు కేసులూ విడుతలవారీగా కొట్టివేత
- అలహాబాద్ హైకోర్టు తీర్పుతో
నొయిడా : దేశాన్ని నివ్వెరపర్చిన 2006 నాటి నిఠారి వరుస హత్యల కేసులో అరెస్టయిన మొయిందర్‌సింగ్ పంధేర్ (65) శుక్రవారం గ్రేటర్ నొయిడాలోని లక్సర్ జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ కేసులో ఆయనను నిర్దోషిగా అలహాబాద్ హైకోర్టు ప్రకటించిన నాలుగు రోజుల తర్వాత ఆయన బయటకు వచ్చాడు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు ఉండే ఈ జైలు నుంచి మధ్యాహ్నం 1.40 గంటల సమయంలో బయటకు వచ్చినప్పుడు తెల్లని పఠానీ సూట్, దానిపై వెయిస్ట్‌కోట్, కాళ్లకు స్పోర్ట్స్ షూతో కనిపించాడు. ముఖానికి మాస్క్ పెట్టుకుని వచ్చిన పంధేర్‌ను కొంతమంది న్యాయవాదులు కలుసుకున్నారు.
అనంతరం ఆయన ఎవరితోనూ మాట్లాడకుండా నేరుగా కారెక్కి వెళ్లిపోయాడు. ఈ కేసులో నేరాన్ని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమవడంతో పంధేర్‌ను, ఆయన సహాయకుడు సురేంద్ర కొలిని అలహాబాద్ హైకోర్టు సోమవారం నిర్దోషులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. నిఠారీలో చోటు చేసుకున్న లైంగికదాడులు, అనంతరం దారుణ హత్యలు, నరమాంస భక్షణ జరిగిందన్న వార్తలు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి.
పంధేర్ విడుదలకు సంబంధించిన రెండో కోర్టు ఉత్తర్వులు శుక్రవారం తమకు అందాయని, లాంఛనాలు ముగించి, ఆయనను జైలు నుంచి విడుదల చేశామని లక్సర్ జైలు సూపరింటెండెంట్ అరుణ్ ప్రతాప్ సింగ్ చెప్పారు. పంధేర్‌ను జైలులోని క్షయ వ్యాధిగ్రస్తుల వార్డులో ఉంచి, చికిత్స చేసినట్టు గతంలో జైలు అధికారులు పేర్కొన్నారు. అంతకు ముందు పందేర్ దస్నా జైల్లో ఉండేవాడు. ఈ ఏడాది జూన్‌లో ఆయనను లక్సర్ జైలుకు తరలించారు.
మరో కీలక నిందితుడు కొలి ఘజియాబాద్‌లోని దస్నా జైల్లో ఉన్నాడు. పద్నాలుగేళ్ల బాలిక హత్య కేసులో అతడు జీవిత ఖైదును అనుభవిస్తున్నాడు. నొయిడాలోని పంధేర్ నివాసం వెనుక 2006, డిసెంబర్ 29న మురికి కాల్వలో చిన్నపిల్లల అస్థికలు లభించిన తర్వాత ఈ హత్యాకాండ వెలుగులోకి వచ్చింది. వీటి ఆధారంగా అక్కడ, ఆ ప్రాంతంలోని మురుగు కాల్వలు తనిఖీ చేయగా.. మరిన్ని అస్థికలు కనిపించాయి. వీటిలో ఎక్కువ అంతకు ముందు ఈ ప్రాంతంలో అదృశ్యమైన చిన్న పిల్లలు, మహిళలవని నిర్ధారణ అయింది. పది రోజుల వ్యవధిలోనే ఈ కేసును సీబీఐ తీసుకున్నది. సీబీఐ పరిశోధనలోనూ మరిన్ని అస్థికలు బయటపడ్డాయి.
ఈ విషయంలో పంధేర్, కొలిపై 2007లో మొత్తం 19 కేసులు నమోదయ్యాయి. మూడు కేసులలో ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో సీబీఐ క్లోజర్ రిపోర్టులను దాఖలు చేసింది. మిగిలిన 16 కేసులలో మూడింటి నుంచి కొలిని విముక్తి చేశారు. ఒక కేసులో మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చారు. పంధేర్‌పై తొలుత ఆరు కేసులలో అభియోగాలు మోపారని ఆయన న్యాయవాదులు తెలిపారు. గతంలో మూడు కేసులలో ఆయనను నిర్దోషిగా సెషన్స్ కోర్టు ప్రకటించింది. మిగిలిన మూడు కేసులలో అలహాబాద్ హైకోర్టు ఒకదానిలో 2009లో మరో రెండింటిపై సోమవారం నిర్దోషిగా ప్రకటించింది.