హిమాలయాల్లో చిక్కుకున్న పర్వతారోహకులు.. ఐదుగురి మృతి

ఉత్త‌రాఖండ్ ఘర్‌వాల్‌ ప‌ర్వ‌త శ్రేణుల్లో ఐదుగురు పర్వతారోహకులు(ట్రెక్కర్లు0 సహస్రతల్ ప్రాంతంలో ప్రతికూల వాతావరణంలో మంచుకొండల్లో చిక్కుకుని మరణించారు.

హిమాలయాల్లో చిక్కుకున్న పర్వతారోహకులు.. ఐదుగురి మృతి

విధాత : ఉత్త‌రాఖండ్ ఘర్‌వాల్‌ ప‌ర్వ‌త శ్రేణుల్లో ఐదుగురు పర్వతారోహకులు(ట్రెక్కర్లు0 సహస్రతల్ ప్రాంతంలో ప్రతికూల వాతావరణంలో మంచుకొండల్లో చిక్కుకుని మరణించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ముగ్గురు స్థానిక గైడ్లతో పాటు కర్ణాటకకు చెందిన 18 మంది ట్రెక్కర్లు, మహారాష్ట్రకు చెందిన ఒకరు హిమాలయాల్లో 4,100-4,400 మీటర్ల ఎత్తులో ఉన్న సహస్రతల్ ఆల్పైన్ సరస్సు వద్ద బుధవారం ట్రెక్కింగ్ చేస్తుండగా మంచులో చిక్కుకుపోయారు. వీరిలో ఐదుగురు మరణించగా మరో 17 మంది జాడ తెలియరాలేదని అధికారులు తెలిపారు.

హిమాలయన్ వ్యూ ట్రెక్కింగ్ ఏజెన్సీ ‘మనేరి’ ద్వారా 22 మంది సభ్యుల ట్రెక్కింగ్ బృందం మే 29న ఉత్తరకాశీ నుంచి 35 కి.మీ. దూరంలో ఉన్న ట్రెక్కింగ్ పాయింట్‌కు చేరుకుందని ఉత్తరకాశీ జిల్లా మేజిస్ట్రేట్ మెహర్బన్ సింగ్ బిష్ తెలిపారు. జూన్ 7 నాటికి బృందం తిరిగి రావాల్సిఉందని, కానీ చివరి బేస్ క్యాంప్ నుంచి సహస్రతల్‌కు చేరుకునేసరికి వాతావరణం సరిగా లేకపోవడంతో వారు దారి తప్పారని బిష్ చెప్పారు. అనంతరం బృందంలోని ఐదుగురు సభ్యులు మరణించారని, ఇతరులు చిక్కుకుపోయారని ట్రెక్కింగ్ ఏజెన్సీ నిర్ధారించింది. వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి ఏరియల్ రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టామని జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. చిక్కుకుపోయిన వారిని రక్షించాలని, మరణించిన వారి మృతదేహాలను గుర్తించాలని భారత వైమానిక దళాన్ని అభ్యర్థించామన్నారు. మట్లీ, హర్సిల్, ఇతర హెలిప్యాడ్ల నుంచి సహాయక చర్యలకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.