1.6 ల‌క్ష‌ల వాహ‌నాల‌కు జరిమానా

1.6 ల‌క్ష‌ల వాహ‌నాల‌కు జరిమానా
  • కాలుష్య నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై కొర‌డా
  • గ‌త ఏడాది చలాన్ల సంఖ్య కంటే 50,662 ఎక్కువ
  • డాటాను వెల్ల‌డించిన ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు



విధాత‌: దేశ రాజ‌ధానిలో కాలుష్య నియంత్ర‌ణ‌కు ఢిల్లీ ప్ర‌భుత్వం అన్నీ ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ది. కాలుష్య నియంత్ర‌ణ నిబంధ‌న‌లు పాటించ‌ని వాహ‌న‌దారుల‌పై కొర‌డా ఝ‌ళిపిస్తున్న‌ది. దేశంలో తిరిగే వాహన‌దారులు చెల్లుబాటు అయ్యే పొల్యుష‌న్ అండ‌ర్ కంట్రోల్ స‌ర్టిఫికెట్లు (పీయూసీసీ) చూపించాల్సి ఉంటుంది. అలాంటి స‌ర్టిఫికెట్లు పొంద‌ని వాహ‌న‌దారుల‌పై ట్రాఫిక్‌పోలీసుల జ‌రిమానాలు విధిస్తున్నారు.


ఇలా ఈ ఏడాది అక్టోబర్ 15 వరకు 1.6 లక్షలకుపైగా వాహ‌న‌దారుల‌కు చ‌లాన్లు విధించారుఈ విష‌యాన్ని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు శ‌నివారం వెల్ల‌డించారు. ట్రాఫిక్ పోలీసుల వివ‌రాల ప్ర‌కారం.. ఈ సంవత్సరం అక్టోబర్ 15 వరకు మొత్తం 1,58,762 చలాన్లు జారీ అయ్యాయి. గత సంవత్సరం ఇదే కాలంలో జారీ చేసిన చలాన్ల సంఖ్య కంటే ఇది 50,662 ఎక్కువ కావ‌డం విశేషం. జనవరి 1 నుంచి అక్టోబర్ 15 వరకు 2021లో 52,388 చలాన్లు, 2022లో 1,08,100 చలాన్లు జారీ చేసిన‌ట్టు డాటా వెల్ల‌డించింది.


మోటారు సైకిల్ రైడర్స్ 69,190, స్కూటర్ రైడర్లు 49,219, కార్ డ్రైవర్లు 33,754, ఆటోరిక్షా డ్రైవర్లు 1,556 మందికి చలాన్లు జారీ చేశారు. 2019లో మొత్తం 81,246, 2020లో 69,199, 2021లో 1,04,369, 2022లో 1,31,799 చలాన్లు జారీ చేయబడ్డాయి. మహమ్మారి కారణంగా వాహ‌నాల రాక‌పోక‌ల‌పై నియ‌త్ర‌ణ ఉండ‌టంతో 2020లో చలాన్‌ల సంఖ్య చాలా తక్కువగా ఉన్న‌ట్టు డాటా తెలిపింది.


సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, వాయు నాణ్యత నిర్వహణ కమిషన్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, పర్యావరణ శాఖ/ఢిల్లీ కాలుష్యం జారీ చేసిన ఆదేశాల మేర‌కు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు నగరంలో వాయు కాలుష్యాన్ని తనిఖీ చేయడానికి, నియంత్రించడానికి అనేక క‌ఠిన చర్యలు తీసుకుంటున్నారు. గాలి నాణ్యతను నిర్వహించడానికి ప్ర‌భుత్వంలోని వివిధ శాఖ‌లు వాటి ప‌రిధిలో చ‌ర్య‌లు తీసుకుంటాయి. దేశంలో తిరిగే వాహన‌దారులు చెల్లుబాటు అయ్యే పొల్యుష‌న్ అండ‌ర్ కంట్రోల్ స‌ర్టిఫికెట్లు (పీయూసీసీ) చూపించ‌డం త‌ప్పనిస‌రి చేసింది.