Nitin Gadkari । బీజేపీ నాలుగోసారి అధికారంలోకి రావడంపై గ్యారెంటీ లేదు కానీ..! : గడ్కరీ సంచలన వ్యాఖ్య.. ఆనక వివరణ..

సరదాగా చేసిన వ్యాఖ్యలు ఒక్కోసారి కొంప ముంచే పరిస్థితులకు దారి తీస్తాయి. లోపల ఉన్నమాటే అన్నారో.. యథాలాపంగా అనేశారో గానీ.. గడ్కరీ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. తర్వాత అబ్బే.. అది జోక్‌.. అంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ.

Nitin Gadkari । బీజేపీ నాలుగోసారి అధికారంలోకి రావడంపై గ్యారెంటీ లేదు కానీ..!  : గడ్కరీ సంచలన వ్యాఖ్య.. ఆనక వివరణ..

Nitin Gadkari । కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నాలుగోసారి అధికారంలోకి రావడంపై గ్యారెంటీ లేదు కానీ.. తన సహచర మంత్రి రాందాస్‌ ఆఠవలె మాత్రం తన క్యాబినెట్‌ పదవిని దక్కించుకుంటారని కేంద్రమంత్రి, బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ ఆదివారం చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా రచ్చ రేపాయి. ఏ ప్రభుత్వంలోనైనా ఆయన తన మంత్రి పదవిని దక్కించుకుంటారని చెబుతూ గడ్కరీ ఈ వ్యాఖ్య చేశారు. నాగపూర్‌లో ఆదివారం నిర్వహించిన ఒక సభలో మాట్లాడిన గడ్కరీ.. ఎన్డీయే ప్రభుత్వం నాలుగోసారి అధికారంలోకి రాకపోయినా ఆఠవలె మాత్రం కేంద్రమంత్రిగా కొనసాగుతారని చెప్పారు. ‘మా ప్రభుత్వం నాలుగోసారి అధికారంలోకి వస్తుందని గ్యారెంటీ లేదు.. కానీ.. రాందాస్‌ ఆఠవలె మంత్రి కావడం మాత్రం గ్యారెంటీ’ అని అన్నారని ఎన్డీటీవీ పేర్కొన్నది.  అనంతరం ఆయన ఇది సరదాగా చేసిన వ్యాఖ్యేనని వివరణ ఇచ్చుకున్నారు.

ఆ సమయంలో వేదికపై ఆఠవలె కూడా ఉన్నారు. మూడు కేంద్ర మంత్రివర్గాల్లో ఆఠవలె మంత్రిగా ఉన్నారు. నాలుగోసారి ఎన్డీయే అధికారంలోకి వచ్చినా మంత్రిని అవుతానని ధీమా  వ్యక్తం చేశారు. రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్‌పీఐ-ఏ) పది నుంచి 12 సీట్లలో పోటీ చేస్తుందని ఆఠవలె తెలిపారు. మహారాష్ట్రలోని మహాయుతిలో భాగస్వామ్యపక్షంగా ఉన్న ఆర్‌పీఐ విదర్భలో నాగపూర్‌, ఉమ్రేద్‌ (నాగపూర్‌), యవత్మాల్‌లోని ఉమర్‌ఖేడ్‌, వాషిం నియోజకవర్గాలను కోరుతున్నదని చెప్పారు. 18 సీట్లతో ఒక జాబితాను రూపొందించుకున్నామన్న ఆయన.. అందులో సర్దుబాట్లలో కనీసం పది పన్నెండు సీట్లలో పోటీ చేస్తామని అన్నారు. మహాయుతిలోని ఇతర పార్టీలు వారి కోటా నుంచి తమకు మూడు నాలుగు సీట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మహాయుతిలో బీజేపీతోపాటు షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్‌పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ, ఆర్‌పీఐ భాగస్వామ్యపక్షాలుగా ఉన్నాయి. మహాయుతి ప్రభుత్వంలోకి అజిత్‌పవార్‌ ఎన్సీపీని తీసుకోవడంతో గతంలోనే తమకు హామీ ఇచ్చి ఉన్నా.. మంత్రివర్గంలో ఆర్‌పైకి అవకాశం దక్కలేదని గతంలో ఆఠవలె వ్యాఖ్యానించారు. రెండు క్యాబినెట్‌ పదవులు, పలు జిల్లా స్థాయి బాధ్యతలు ఇస్తామని చెప్పినా ఎన్సీపీ చేరికతో వీలు కాలేదని అన్నారు.