ఆగ్రాలో రైల్వే గేట్‌మ్యాన్ అప్రమత్తతో తప్పిన పెను విషాదం

- పాతాల్‌కోట్ ఎక్స్‌ప్రెస్ రైలులో చెలరేగిన మంటలు
- సకాలంలో గుర్తించడంతో తప్పిన పెను ముప్పు
- 11 మందికి స్వల్ప గాయాలు.. దవాఖానలో చికిత్స
విధాత: ఆగ్రాలోని భండాయి రైల్వే స్టేషన్ సమీపంలో గేట్‌మ్యాన్ పెను విషాదాన్ని అడ్డుకున్నాడు. పాతాల్‌కోట్ ఎక్స్‌ప్రెస్ బోగీల్లో చెలరేగిన పొగను గుర్తించాడు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. వారు కూడా సకాలంలో స్పందించి రైలు ఆపించారు. అగ్నిమాపక సిబ్బంది ద్వారా మంటలను అదుపులోకి తెచ్చారు. 11 మందికి మాత్రమే స్వల్ప గాయాలయ్యాయి. రైల్వే గేట్‌మ్యాన్ సకాలంలో పొగను గుర్తించి అధికారులను అలర్ట్ చేయకపోయి ఉంటే, భారీగా ప్రాణ నష్టం జరిగి ఉండేది. పెను విషాదాన్ని తప్పించిన హీరోగా రిటైర్డ్ ఆర్మీ అధికారి, గేట్‌మెన్ యశ్‌పాల్ సింగ్‌ను అధికారులతోపాటు ప్రయాణికులు సైతం ప్రశంసిస్తున్నారు.
అసలు ఏమి జరిగిందంటే.. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ కంటోన్మెంట్ నుంచి మధ్యప్రదేశ్‌లోని సియోనీకి పాతాల్‌కోట్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరింది. రైలు ఆగ్రాకు 10 కిలోమీటర్ల దూరంలోని భండాయ్ స్టేషన్‌కు చేరుకునే ముందు బుధవారం మధ్యాహ్నం 3.35 గంటలకు రైలు గేట్ గుండా వెళుతున్నప్పుడు, ఇంజిన్ నుంచి 4వ కోచ్ కింద పొగలు వస్తున్నట్టు.. అక్కడి రైల్వే లెవల్ క్రాసింగ్ గేట్‌మ్యాన్ యశ్‌పాల్ సింగ్ గుర్తించారు. రైలు లోపల ఉన్న వారెవరికీ అది తెలియలేదు. యశ్‌పాల్ వెంటనే భండాయ్ స్టేషన్ డిప్యూటీ స్టేషన్ సూపరింటెండెంట్ హరిదాస్‌కు కాల్ చేశారు. బోగీలో పొగ విషయం తెలిపారు. ఆయన కంట్రోల్ రూమ్‌కి మరింత సమాచారం ఇచ్చాడు.
పాతాల్‌కోట్ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 3.37 గంటలకు అప్పటికే భాండాయ్ స్టేషన్‌ను దాటింది. మంటలు అప్పటికే రెండు కోచ్‌లను వ్యాపించాయి. ఇంజిన్ నుంచి 3వ, 4 వ ప్రయాణీకులందరినీ సకాలంలో కిందికి దించారు. 10 నిమిషాల్లో, అగ్నిమాపక దళం, అంబులెన్స్, సెల్ఫ్ ప్రొపెల్డ్ యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్ సైట్‌కు చేరుకున్నాయి.
అగ్నిమాపక సిబ్బంది. మంటలను ఆర్పివేయడానికి ప్రయత్నించారు. సాయంత్రం 5.10 గంటలకు మంటలు పూర్తిగా ఆరిపోయాయి. మొత్తం 11 మందికి స్వల్ప కాలిన గాయాలయ్యాయి. వారికి సమీప దవాఖానకు తరలించారు. ఐదుగురు దవాఖానల్లో చికిత్స పొందుతుండగా, మరో ఆరుగురు కాలినగాయాలకు చికిత్సచేయించుకొని డిశ్చారి అయినట్టు ఆగ్రాలోని ఎస్‌ఎన్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రశాంత్ గుప్తా తెలిపారు.
అంతకంటే ముందు ట్రైన్ కంట్రోలర్ వెంటనే ఓహెచ్‌ఈ (ఓవర్ హెడ్ ఎక్విప్‌మెంట్) ఇన్‌చార్జి ద్వారా ఆ మార్గంలోని రైళ్ల రాకపోకలను నిలిపివేయించారు. విద్యుత్ సరఫరాను కూడా ఆపివేయించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు వెంటనే తెలియరాలేదని ఆగ్రా రైల్వే డివిజన్ పీఆర్వో ప్రశస్తి శ్రీవాస్తవ తెలిపారు.
“ఎన్‌సిఆర్ (నార్త్ సెంట్రల్ రైల్వే), ఆగ్రా డివిజన్‌లోని భండాయి, జజౌ మధ్య పాతాల్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. రెండు కోచ్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి. పక్కనే ఉన్న రెండు కోచ్‌లు కూడా ప్రభావితమయ్యాయి. మొత్తం నాలుగు కోచ్‌లు వేరు చేయబడ్డాయి. రైలు, పరిస్థితి అదుపులో ఉన్నది” అని ఆమె చెప్పారు.