Delimitation। దక్షిణాది రాష్ట్రాలపై డీలిమిటేషన్ కత్తి : సీఎం పినరాయి విజయన్..
డీలిమిటేషన్ ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాలపై వేలాడుతున్న కత్తి (స్వోర్డ్ ఆఫ్ డామక్లీజ్) లాంటిదని కేరళ సీఎం పినరాయి విజయన్ హెచ్చరించారు. రాజ్యాంగ, ప్రజాస్వామిక సూత్రాలను పట్టించుకోకుండా రాజకీయ ప్రయోజనాల కోసం చూస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.

Delimitation। జనాభా ప్రాతిపదికన చేపట్టే లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగబోతున్నదని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష పార్టీ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. తమిళనాడు అధికార పార్టీ డీఎంకే ఆధ్వర్యంలో ‘న్యాయమైన వాటా కోసం జాయింట్ యాక్షన్ కమిటీ’ తొలి సమావేశం శనివారం చెన్నైలో నిర్వహించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో కేరళ సీఎం పినరాయి విజయన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఒడిశాకు చెందిన ప్రతిపక్ష బీజేడీ నేత నవీన్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన సహేతుకంగా ఉండాలని ఈ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. జనాభా నియంత్రణ విధానాలను విజయవంతంగా అమలు చేసినందుకు దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడం తగదని స్పష్టంచేసింది. దక్షిణాది రాష్ట్రాల ప్రజాస్వామిక ప్రాతినిధ్యాన్ని కాపాడుకునేందుకు అవసరమైతే న్యాయపరమైన మార్గాలను కూడా అన్వేషిస్తామని స్టాలిన్ చెప్పారు.
డీలిమిటేషన్ ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాలపై వేలాడుతున్న కత్తి (స్వోర్డ్ ఆఫ్ డామక్లీజ్) లాంటిదని కేరళ సీఎం పినరాయి విజయన్ హెచ్చరించారు. రాజ్యాంగ, ప్రజాస్వామిక సూత్రాలను పట్టించుకోకుండా రాజకీయ ప్రయోజనాల కోసం చూస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. ‘ఈ ఆకస్మిక చర్య రాజ్యంగ సూత్రాలను అనుసరించి చేపడుతున్నది కాదు. సంకుచితమైన రాజకీయ ప్రయోజనాల కోసం చేపడుతున్నది’ అని ఆయన విమర్శించారు. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాలను పునర్విభజిస్తే ఉత్తరాది రాష్ట్రాలకు భారీ ఎత్తున మేలు జరిగుతుదని, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం మాత్రం గణనీయంగా తగ్గిపోతుందని అన్నారు. ఈ విషయంలో నిపుణుల కమిటీ ‘జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ ఫెయిర్ డీలిమిటేషన్’ ఏర్పాటుకు సీఎం ఎంకే స్టాలిన్ ప్రతిపాదన చేశారు. తాము డీలిమిటేషన్‌కు వ్యతిరేకం కాదని, కానీ న్యాయబద్ధంగా డీలిమిటేషన్ జరుగాలని కోరుకుంటున్నామని స్పష్టంచేశారు. దక్షిణాది రాష్ట్రాల హక్కులను రక్షించుకునేందుకు నిరంతరాయంగా కృషి చేస్తామని తెలిపారు.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంలో కోత పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వ చర్యను పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ సైతం తప్పుపట్టారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో లబ్ధి పొందేందుకు, ఎదురుదెబ్బలు తింటున్న రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గించేందుకు సీట్ల కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడాలని ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. ‘పంజాబ్‌లో బీజేపీ గెలవలేదు. ప్రస్తుత 13 సీట్లలో ఒక్కటి కూడా గెలుచుకోలేక పోయింది’ అని ఆయన పేర్కొన్నారు. జనాభా పెరుగుదలను నియంత్రించడంలో విజయం సాధించినందుకు దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తున్నారా? అని మాన్ ప్రశ్నించారు.
జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్‌ను అంగీకరించం : రేవంత్ రెడ్డి
జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ప్రక్రియను కేంద్రం కొనసాగించినట్టయితే ఉత్తరాది రాష్ట్రాలు తమను (దక్షిణాది) ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణిస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇటువంటి వైఖరిని దక్షిణాది రాష్ట్రాలు అంగీకరించే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణ మాజీ మంత్రి, బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మాట్లాడుతూ..కేవలం జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయడం తీవ్ర అన్యాయమని చెప్పారు. ఈ ప్రక్రియపై దేశవ్యాప్తంగా సంప్రదింపులు జరపాలని ఈ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న బీజేడీ అధ్యక్షుడు, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సూచించారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు జనాభా లెక్కలే ప్రామాణికం కారాదని ఆయన స్పష్టంచేశారు. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలను కేంద్రం సంప్రదించాలని కోరారు. ఒడిశాతోపాటు కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పశ్చిమబెంగాల్, పంజాబ్ వంటి రాష్ట్రాలు జనాభా నియంత్రణ చర్యలను విజయవంతంగా అమలు చేశాయని తెలిపారు. అందుకు వారికి జరిమానాలు విధించరాదని అన్నారు. ఈ రాష్ట్రాలు జనాభా నియంత్రణ చర్యలు అమలు చేయకుంటే దేశంలో జనాభా విస్పోటం చెంది, అభివృద్ధి కుంటుపడేదని గుర్తు చేశారు. డీలిమిటేషన్ జరుగాల్సిందేనన్న ఎన్సీపీ (ఎస్పీ) నేత సుప్రియా సూలె.. అది న్యాయంగా ఉండాలని చెప్పారు. ‘డీలిమిటేషన్‌పై ఎలాంటి క్లారిటీ లేదు. మాకు అందోళనగా ఉన్నది. డీలిమిటేషన్ చేపట్టాల్సిందే. కానీ.. అది న్యాయంగా ఉండాలి’ అని సమావేశం అనంతరం ఆమె మీడియాతో అన్నారు. 2026 తర్వాత నిర్వహించే తొలి జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ అంటే.. 2031 తర్వాత డీలిమిటేషన్ నిర్వహించేలా 2002లో అప్పటి ప్రధాన మంత్రి ఏబీ వాజ్‌పేయి ప్రభుత్వం చట్టసవరణ చేసిన విషయాన్ని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ గుర్తు చేశారు. జనాభా నియంత్రణకు కృషి చేసిన రాష్ట్రాలకు పార్లమెంటరీ ప్రాతినిధ్యంలో కోత పెట్టడం ద్వారా శిక్షించడం తగదన్నారు.