విధాత : దేశ రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-Kisan) 23వ విడత నిధులు జూన్ 20, 2026న అర్హులైన రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లుగా తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 9 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చేలా కేంద్ర వ్యవసాయ శాఖ ఈ నిధులను నేరుగా బదిలీ (DBT) ద్వారా విడుదల చేయనుంది.
ఈ కేవైసీ చేసుకున్న రైతులకు పీఎం కిసాన్ నిధులు అందుతాయని అధికారులు స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ పథకం కింద అర్హత ఉన్న రైతులకు ఏడాదికి మొత్తం రూ.6,000 అందిస్తారు. ఈ మొత్తాన్ని మూడు సమాన విడతలుగా, ఒక్కోసారి రూ.2,000 చొప్పున రైతుల ఖాతాల్లో నేరుగా బదిలీ జరుగుతుంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2026 మార్చి 13న అస్సాంలో గువాహటిలో పీఎం-కిసాన్ పథకం 22వ విడతను విడుదల చేసి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) వ్యవస్థ ద్వారా 9.32 కోట్ల అర్హులైన రైతులకు రూ.18,640 కోట్లు బదిలీ చేశారు. ఇప్పటివరకు, ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ప్రారంభం నుండి రూ.4.27 లక్షల కోట్లకు పైగా పంపిణీ చేసింది. పీఎం-కిసాన్ పథకం ప్రపంచంలో అతిపెద్ద డిబీటీ కార్యక్రమాలలో ఒకటిగా గుర్తింపు పొందింది.
తెలంగాణలో రైతు భరోసాపై 18న కేబినెట్ లో నిర్ణయం
తెలంగాణలో పెండింగ్ లో ఉన్న యాసంగి మూడో విడత రైతు భరోసా విడుదల అంశంతో పాటు ఐదు ఎకరాలకు పైగా ఉన్న రైతులకు రైతు భరోసా పంపిణీ విషయమై ఈ నెల 18న జరిగే కేబినేట్ లో చర్చించనున్నట్లుగా సమాచారం.
