నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీ నేపథ్యంలో.. ఈ నెల 21న జరిగే రీ ఎగ్జామ్ నిర్వహణను సక్రమంగా పూర్తి చేసేందుకు కేంద్రం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. నీట్ రీ ఎగ్జామ్ నిర్వహణ సందర్బంగా ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వాడకంపై ఈ నెల 22 వరకు ఆంక్షలు విధించింది. ఐటీ చట్టం సెక్షన్ 69ఏ కింద ఈ నిర్ణయం తీసుకుంది. పరీక్ష భద్రతను దృష్టిలో ఉంచుకుని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సిఫార్సు మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అలాగే టెలిగ్రామ్‌లో ఈనెల 30 వరకు మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను పూర్తిగా నిలిపివేయాలని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష పూర్తైన తర్వాత పాత టైమ్ స్టాంప్‌లతో నకిలీ ‘పేపర్ లీక్’ ఆధారాలు సృష్టిస్తున్న ముఠాలను అడ్డుకోవడానికే మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌పై నిషేధం విధించినట్లు తెలుస్తోంది. పేపర్ లీక్ పేరుతో విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న నకిలీ టెలిగ్రామ్ ఛానళ్లపై ఇప్పటికే సైబర్ క్రైమ్ విభాగాలు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అహ్మదాబాద్‌లో 8 టెలిగ్రామ్ ఛానళ్లను నడుపుతూ రూ.1.5 కోట్ల మోసాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాను సైబర్ క్రైమ్ బ్రాంచ్ అరెస్ట్ చేసింది. నీట్ పేపర్ తయారు చేసిన వాళ్లను ఎన్‌టీఏ ఇప్పటికే రహస్య ప్రాంతంలో లాక్‌డౌన్ చేసిన సంగతి తెలిసిందే. ప్రశ్నాపత్రాల లీకేజీ నేపథ్యంలో ఈ దఫా ప్రశ్నపత్రాల తరలింపుకు కేంద్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ని వాడుతుంది. NEET రీ టెస్ట్ ప్రశ్నాపత్రాలను దేశవ్యాప్తంగా 18 IAF కేంద్రాలకు mi-17 హెలికాఫ్టర్ల ద్వారా తరలించనుంది. అక్కడినుంచి వివిధ పరీక్ష కేంద్రాలకు ఎయిర్ ఫోర్స్ తరలిస్తుంది.
జూన్ 21న జరగనున్న NEET (UG) 2026 రీ-ఎగ్జామ్‌కు ముందు ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలపై ఎన్టీఏ స్పందించింది. అవన్నీ తప్పుడు ప్రచారాలేనని స్పష్టం చేస్తూ, విద్యార్థులు అధికారిక సమాచారం కోసం ఎన్టీఏ వెబ్‌సైట్ (www.neet.nta.nic.in) ను మాత్రమే అనుసరించాలని సూచించింది. ఎవరైనా మోసాలకు పాల్పడితే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కి ఫిర్యాదు చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరింది.
