విధాత ప్రత్యేకం: ఒక వేలు ఎదుటివారికి చూపిస్తే నాలుగు వేళ్లు మనవైపే చూస్తుంటాయి! తప్పులెంచువారు తమ తప్పులెరగరయా అని వేమన ఏనాడో చెప్పాడు! అంతే మరి! అధికార దర్పంతో ఉన్నప్పుడు మనం ఏ పని చేసినా తప్పనిపించదు! పైగా అదో గొప్పగా అనిపిస్తుంది! కానీ.. ప్రతిపక్ష నేతలు ఎవరైనా చేస్తే మాత్రం అది ఒక జాతినో, ఒక కులాన్నో అవమానించినట్టే! పార్లమెంటులో ఎవడుబడితే వాడు జొచ్చి.. దేన్నిపడితే దాన్ని పట్టుకుని హల్ చల్ చేస్తుంటే.. భవదీయులకు పెద్ద లోపంగా కనిపించదు! ఇంతటి భద్రతా వైఫల్యమేంటని నిలదీస్తే అదో పాపం అన్నట్టే చూస్తారు! ధర్నా చేస్తూ ఒకరిని అనుకరిస్తే.. అది ఆ వ్యక్తి వ్యక్తిత్వహననం అన్నట్టు సీన్ క్రియేట్ అయిపోతుంది.
ఆయన కులాన్ని కించపరిచారన్న పాయింట్ చర్చలోకి వస్తుంది. ప్రధాని ఫోన్ చేసి ఆరా తీస్తారు.. రాష్ట్రపతి దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తారు! బీజేపీ నేతలు అంతా పొలోమని మీదపడిపోయి నానా రచ్చ చేస్తారు! మీడియా సైతం ఆ మిమిక్రీ గురించి కోడై కూస్తుంది! గోడీ మీడియాకు ఇక పట్టపగ్గాలే ఉండవు! కానీ.. అసలు విషయం పక్కకు వెళ్లిపోతుంది. నానా ఆర్భాటాలు చేసి.. రాజు వెడలె రవి తేజములలరగ.. అన్నట్టు కొత్త పార్లమెంటును ప్రారంభిస్తే.. తీరా అంతటి గొప్ప భవనంలో భద్రత మాత్రం డొల్లేనన్న కీలక అంశం పట్టరానిదైపోతుంది! దాన్ని ఎంపీలు ప్రశ్నించడం శిక్షార్హమవుతుంది!
నిజానికి టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ.. రాజ్యసభ చైర్మన్‌ను అనుకరించిన విషయంలో లోతుగా చూస్తే పెద్ద దోషమేమీ కనిపించదు! నిజానికి ఈ మిమిక్రీలు గతంలో లేనివా? సాక్షాత్తూ ఏ ప్రధాని అయితే.. మిమిక్రీకి స్పందించి.. ఆరా తీశారో.. అదే ప్రధాని లోక్‌సభలో చేసిన మిమిక్రీల సంగతేంటని అడిగితే ఈ బీజేపీ నేతలు ఏం చెబుతారు? నిజానికి పసలేని మిమిక్రీ అంశాన్ని పట్టుకుని.. పార్లమెంటు భద్రతా వైఫల్యాన్ని కప్పిచ్చుకునే ప్రయత్నాలే ఈ ఎపిసోడ్‌లో కనిపిస్తాయి. నిజానికి ధన్‌కర్ సైతం తన పదవిని అవమానించారా? లేక తన కులాన్ని అవమానించారా? అన్న విషయంలో స్పష్టంగా చెప్పలేకపోయారని పరిశీలకులు అంటున్నారు. కానీ.. ప్రధాని మోదీ చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో ప్రతిపక్ష నేతలను అవమానించిన ఉదంతాలు అనేకం ఉన్నాయని వారు గుర్తు చేస్తున్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ‘దీదీ ఓ దీదీ’ అంటూ కామెంట్ చేసిన విషయాన్ని ఎవరు మర్చిపోగలరని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. ‘కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ దివంగత భార్యను ఉద్దేశించి ‘యాభై కోట్ల ప్రియురాలు’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించేందుకు మోదీ ఎందుకు సాహసించారు? రాహుల్‌గాంధీని పట్టుకుని ‘పప్పు’ అని ఎన్నికల ప్రచార సభల్లో ఎన్నిసార్లు అనలేదు? ఆఖరుకు పార్లమెంటులో సైతం ప్రతిపక్ష సభ్యులను అనుకరించిన సందర్భాలు ఎన్ని లేవు? ఆఖరుకు అప్పటి ఉప రాష్ట్రపతిని ఒక ముస్లిం అన్న కోణంలో మాట్లాడిన సందర్భాలు లేవా? మైనార్టీ వ్యవహారాలకు, ముస్లిం ప్రపంచానికి మాత్రమే ఆయన అనుభవం పరిమితమని అగౌరవంగా మాట్లాడిన దానికి ఏం చెబుతారు? ఇవన్నీ మాట్లాడితే బీజేపీ నాయకులకు ఒప్పదు. కానీ.. తృణమూల్ ఎంపీ మిమిక్రీ చేస్తే మాత్రం పౌరుషం పొంగుకొస్తది’ అని ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలను కవర్ చేసే ఒక సీనియర్ తెలుగు జర్నలిస్టు ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్కూళ్లలో, కాలేజీల్లో రౌడీయిజం చేసే కొందరు బలమైన పిల్లగాళ్లు.. అమాయకులైన లేదా బలహీనమైనవారిని ర్యాగింగ్ చేయడాన్ని ఇటువంటి పరిణామాలు, ద్వంద్వనీతి ప్రమాణాలు గుర్తు చేస్తుంటాయి. అలాంటి బీజేపీ కానీ, ఆ పార్టీ అగ్రనాయకులుగానీ ఒక సాధారణ, సరదా చేష్టను ఆస్వాదించలేని, సహించలేని స్థితికి చేరుకున్నారంటే దీన్ని అహంకారం అనాలా? అధికార దర్పం అనాలా? ఓర్వలేనితనం అనాలా? అని ఆయన సందేహం వ్యక్తం చేశారు.
కల్యాణ్ బెనర్జీ మిమిక్రీ చేయడం, దానిని రాహుల్‌గాంధీ తన ఫోన్‌లో చిత్రీకరించడంపై అధికార పక్షం ఆడుతున్న ఆటలో ముఖ్యమైన ప్రశ్న మాత్రం సమాధి అయిపోయింది. ఆ ప్రశ్నే.. భద్రతా వైఫల్యంపై హోం మంత్రి పార్లమెంటులో ప్రకటన ఎందుకు చేయరు?