UPSC | యూపీఎస్సీ నూతన చైర్ పర్సన్‌గా ప్రీతి సుదాస్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నూతన చైర్ పర్సన్‌గా కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి ప్రీతి సుదాస్ నియామితులయ్యారు. ప్రస్తుతం ఆమె యూపీఎస్సీ సభ్యురాలిగా పనిచేస్తున్నారు

విధాత, హైదరాబాద్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నూతన చైర్ పర్సన్‌గా కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి ప్రీతి సుదాస్ నియామితులయ్యారు. ప్రస్తుతం ఆమె యూపీఎస్సీ సభ్యురాలిగా పనిచేస్తున్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రీతిసుదాస్ ఆగస్టు ఒకటో తేదీన, రాజ్యాంగంలోని ఆర్టికల్ 316ఏ ప్రకారం ఆమె భాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం యూపీఎస్సీ చైర్మన్‌గా ఉన్న మనోజ్ సోనీ కొన్ని రోజుల క్రితం వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేసిన విషయం తెలిసింది. 2029 మే 15 వరకూ పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయన ఐదేళ్ల ముందుగానే వ్యక్తిగత కారణాలతో వైదొలిగిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో ప్రీతి సుదాస్ ఆ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రీతిసుదాస్ 29 ఏప్రిల్ 2025 వరకు సేవలందిస్తారు. ఆంధ్రా కేడర్‌కు చెందిన 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ప్రీతిసుదాస్ సుడాన్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఎకనామిక్స్ అండ్ సోషల్ పాలసీ అండ్ ప్లానింగ్ లో ఆమె డిగ్రీలు పొందారు. వాషింగ్టన్‌లో పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్‌లో శిక్షణ తీసుకున్నారు. మరోవైపు గతంలో ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. రక్షణ మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ వంటి వివిధ కేంద్ర, రాష్ట్ర స్థాయి బాధ్యతల్లో పనిచేశారు. అలాగే విపత్తు నిర్వహణ, పర్యాటక రంగానికి సంబంధించిన హోదాలో పనిచేశారు. ఆమె ప్రపంచ బ్యాంకులో సలహాదారుగా కూడా పనిచేశారు. అలాగే కరోనా సమయంలో ఆమె క్రియాశీలకంగా విధులు నిర్వహించారు.