మోదీ నోట రాహుల్ గురించి ఇంత మాటా?
కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ మూర్ఖోంకే సర్దార్ (మూర్ఖుల నాయకుడు) అని మండిపడ్డారు

- ఏ ప్రపంచంలో బతుకుతున్నాడు?
- కాంగ్రెస్ ఎంపీపై మోదీ ఫైర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ మూర్ఖోంకే సర్దార్ (మూర్ఖుల నాయకుడు) అని మండిపడ్డారు. భారతదేశంలోని మొబైల్ ఫోన్లలో అత్యధికం చైనాలో తయారైనవేనని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఆయన పై విధంగా స్పందించారు. లక్ష కోట్ల విలువైన మొబైల్ ఫోన్‌లు భారత్ నుంచి ఎగమతి అవుతున్నాయని చెప్పారు.
నిన్న ‘ఒక కాంగ్రెస్ మేధావి దేశంలో ప్రజల వద్ద చైనా మొబైళ్లే ఉన్నాయని చెబుతున్నారు. అరే.. మూర్ఖోంకే సర్దార్.. ఏ ప్రపంచంలో బతుకుతున్నావు? దేశ ప్రగతిని గుర్తించ నిరాకరించడమనే మానసిక రోగంతో కాంగ్రెస్ నాయకులు బాధపడుతున్నారు. భారతదేశంలో కనిపించడం లేదంటే వాళ్లు ఏ విదేశీ కళ్లజోడు పెట్టుకున్నారో అర్థం కావడం లేదు’ అని రాహుల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ప్రపంచంలోనే మొబైల్ ఫోన్‌ల తయారీలో భారత్ రెండో అతిపెద్ద దేశమని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో 20వేల కోట్ల విలువైన మొబైల్ ఫోన్‌లు తయారు చేసేవారని, ఈ రోజు పరిశ్రమ మూడున్నర లక్షల కోట్లకు పెరిగిందని, లక్ష కోట్ల విలువైన మొబైల్‌ఫోన్‌లు విదేశాలకు ఎగమతి చేస్తున్నామని తెలిపారు.