ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆసక్తికర ట్వీట్ చేశారు. అండమాన్, నికోబార్ దీవులలో దేశ రక్షణ అవసరాల పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గ్రేట్ నికోబార్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ ఈ పోస్టు చేశారు. నేను భారతదేశపు అత్యంత దక్షిణపు కొనను గ్రేట్ నికోబార్ ను సందర్శించానని తెలిపారు. నేను ఇందిరా పాయింట్ వద్ద నిలబడ్డాను. శతాబ్దాలుగా నిలబడి ఉన్న చెట్ల కింద నడిచాను. భూమిపైనే అత్యంత జీవకళతో నిండిన పగడపు దిబ్బలలోకి నేను మునిగానని, అక్కడ నివసించే ప్రజలతో కూర్చుని మాట్లాడానని.. సంబంధిత దృశ్యాలతో కూడిన వీడియోను పోస్టు చేశారు.

గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ దేశ రక్షణకు సంబంధించినదని ప్రధాని మోదీ ప్రభుత్వం, బీజేపీ మీకు చెబుతాయని..కానీ అది వాస్తవం కాదన్నారు. జాతీయ రక్షణను బలోపేతం చేయడానికి గ్రేట్ నికోబార్ అడవులను నాశనం చేయాల్సిన అవసరం లేదని, ఇప్పటికే ఉన్న ‘ఐఎన్​ఎస్​ బాజ్’ (INS Baaz) స్థావరాన్ని విస్తరిస్తే సరిపోతుందని ఆయన సూచించారు. దానికి మేము ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తాం అని, నౌకాదళం ఐదేళ్లుగా విస్తరణ కోసం అడుగుతున్నా.. దానిని పట్టించుకోలేదని రాహుల్ తప్పుబట్టారు.

గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు..ఇది ఒక ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్‌కు సంబంధించినదని కేంద్రం మీకు చెబుతుందని, నిజం అది కాదని, భారతదేశం ఇప్పటికే ప్రధాన భూభాగంలో ఉన్న కేరళలో ఒకదాన్ని నిర్మిస్తోందని గుర్తు చేశారు. రక్షణ పేరుతో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్.. కేవలం ఒక నిర్దిష్ట పారిశ్రామికవేత్త ప్రయోజనాల కోసమేనని, హోటళ్లు, రిసార్ట్‌ల నిర్మాణం దీని అసలు ఉద్దేశమని విమర్శించారు. వాస్తవానికి ఇది ఏమిటంటే…ప్రాజెక్ట్ కోసం సుమారు 160 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న వర్షారణ్యాలను, 1.5 కోట్ల చెట్లను నరికివేయడం అని, అధికారిక పటాల నుండి పగడపు దిబ్బలను తొలగించడం, సైనికులు, గిరిజనులను నిరాశ్రయులను చేయడం అని రాహుల్ గాంధీ ఆరోపించారు. కేవలం ఒక వ్యాపారవేత్త భారతదేశంలోని అత్యంత అమూల్యమైన పర్యావరణ భూమిపై హోటళ్లు, క్యాసినోలు నిర్మించుకోవడం కోసం ఈ ప్రాజెక్టు చేపట్టారంటూవిమర్శించారు.

గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు పేరుతో.. అటవీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించి స్థానిక గిరిజనుల భూములను లాక్కుంటున్నారని, భారత ప్రభుత్వం ఇప్పటికే ఈ ద్వీపాలలో స్థిరపరిచిన వలసదారులు, గిరిజను తెగల మనుగడను పట్టించుకోవడం లేదని, వారి జీవన విధానానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. వీరిలో చాలామంది మాజీ సైనికులు కూడా ఉన్నారని, వీరికి సరైన పరిహారం అందడం లేదు అని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రూ. 81 వేల కోట్లతో చేపట్టిన “గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్” అంతా కూడా.. అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసమని, దేశ సహజ, గిరిజన వారసత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటని అభివర్ణించారు. లక్షలాది చెట్లను నరికివేయడం మరియు గిరిజనుల హక్కులను కాలరాయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ ప్రపంచపర్యావరణం దినోత్సవం సందర్భంగా నేను ప్రతి యువ భారతీయుడిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నానని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మీరు ఎలాంటి భారతదేశాన్ని వారసత్వంగా పొందాలనుకుంటున్నారు? క్యాసినోల కోసం వర్షారణ్యాలను బుల్డోజర్లతో కూల్చివేసి, పగడపు దిబ్బలను పటాల నుండి తుడిచివేసి, గిరిజన సమూహాలను వారి భూముల నుండి తరిమివేసి, మనం పీల్చే గాలి విషంగా మారిన భారతదేశాన్నా? అని ప్రశ్నించారు. లేక భారతదేశ సహజ వారసత్వం పరిరక్షించబడి, మన గిరిజన సమూహాలు సురక్షితంగా ఉండి, అభివృద్ధి ప్రకృతికి వ్యతిరేకంగా కాకుండా, దానితో కలిసి సాగే భారతదేశాన్నా? అని ప్రశ్నించారు.

ప్రస్తుతం మోదీ ప్రభుత్వం గ్రేట్ నికోబార్ దీవిని నాశనం చేస్తోంది. కేవలం ఒక వ్యాపారవేత్త లాభం కోసం, 15 లక్షలకు పైగా చెట్లు, పురాతన పగడపు దిబ్బలు, అమూల్యమైన వర్షారణ్యాలు ధ్వంసం చేయబడుతున్నాయని పునరుద్ఘాటించారు. వారు బుల్డోజర్లతో కూల్చివేస్తున్నది మీ వారసత్వాన్నే. వారిని ఆపగలది మీరు మాత్రమేనని, పిటిషన్‌పై సంతకం చేయండి. మేమే ఎంచుకుంటున్నామని మోదీ ప్రభుత్వానికి చెప్పండని కోరారు.

నేను మాట్లాడిన ప్రతి మాట యువ భారతీయుడికి అర్థమైందని, తిరిగి పొందలేని దాన్ని..పర్యావరణాన్ని నాశనం చేయడానికి ఎంత లాభం కూడా సరిపోదని మీకు తెలుసు అని రాహుల్ పేర్కొన్నారు. నేను పర్యావరణ సమతుల్య అభివృద్ధికి కట్టుబడి ఉంటాననని, ఈ ద్వీపాలు ప్రపంచం ఇంతవరకు చూడని అత్యంత అసాధారణమైన సుస్థిర గమ్యస్థానంగా మారగలవు అని, అలాంటి భారతదేశం కోసమే పోరాడాలని కోరారు.