రాహుల్ రావణ్.. మోదీ దానవ్! బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోస్టర్‌వార్

సోషల్ మీడియాలో పోస్టుల కుప్ప
న్యూఢిల్లీ: త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోస్టర్ యుద్ధం మొదలైంది. రాహుల్ గాంధీని కొత్త తరం రావణుడిగా పేర్కొంటూ గడ్డంతో ఉన్న రాహుల్ పది తలల మార్ఫింగ్ చిత్రాన్ని ‘భారత్ ఖత్‌రేమే హై’ అనే కామెంట్‌తో ట్విట్టర్‌లో బీజేపీ పోస్టు చేసింది. ఆ పోస్టర్‌పై ‘కాంగ్రెస్ ప్రొడక్షన్.. దర్శకత్వం జార్జ్ సోరోస్ అని పేర్కొన్నది.
దీనికి దీటుగా బదులిచ్చే క్రమంలో కాంగ్రెస్.. మోదీని రాక్షసుడిగా చూపుతూ ‘మో’దానవ్’ అంటూ వేరొక చిత్రాన్నిభారత్ ఖత్రేమే హై అనే కామెంట్‌తో పోస్టు చేసింది. ఆ చిత్రంపై ‘భ్రష్ట్, జుమ్లేబాజ్ పార్టీ ప్రొడక్షన్.. దర్శకత్వం పరమ్ మిత్ర అదానీ అని రాసింది. ‘ఇతను కొత్త తరం రావణుడు. ఇతడు దుష్టుడు, ధర్మానికి వ్యతిరేకి. రాముడికి వ్యతిరేకి. భారత్‌ను నాశనం చేయడమే ఈయన లక్ష్యం.. అంటూ కామెంట్ పెట్టింది. దీంతో సామాజిక మాధ్యమాల్లో యుద్ధం మొదలైంది. జార్జ్ సోరోస్.. అమెరికన్ హంగేరియన్ వ్యాపారవేత్త, పరోపకారి. గతంలో మోదీకి వ్యతిరేకంగా ఆయన వ్యాఖ్యలు చేశారు.
దీనికి ప్రతిగా కాంగ్రెస్ పెట్టిన పోస్టర్‌లో మోదీకి మిత్రుడని తరచూ ఆరోపించే అదానీ పేరును పెట్టింది. ‘కొత్త తరం మోదానవ్ ఈయనే. ఈయన దుష్టుడు. ప్రజాస్వామ్య వ్యతిరేకి. రాజ్యాంగ వ్యతిరేకి. ప్రజా వ్యతిరేకి. మానవతావాదానికి వ్యతిరేకి. ఆయన ఏకైక లక్ష్యం భారత్, ఇండియా భావనను నాశనం చేయడమే’ అని ఇండియన్ యూత్ కాంగ్రెస్ నాయకుడు బీవీ శ్రీనివాస్ ఆ ఫొటో కింద కామెంట్ పెట్టారు. ఇక దీని ఆధారంగా ఇరు పార్టీల నేతలు తోచిన విధంగా ఫొటోలు పెట్టారు.
బీజేపీ పోస్టర్‌పై కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి స్పందిస్తూ.. రాహుల్ గాంధీ ఎల్లప్పుడూ భారత ప్రజల పక్షానే నిలిచారని అన్నారు. అటువంటి వ్యక్తిని రావణుడు అని ఎలా పిలుస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎంత భయంతో ఉన్నదో దీనిని బట్టి తెలిసిపోతున్నదని చెప్పారు. ఇటీవలి కాలంలో రాహుల్‌గాంధీ క్రియాశీలకంగా ఉండటంతో బీజేపీ కుంగిపోతున్నదని అన్నారు. మరోవైపు ఇండియా కూటమి పట్ల ప్రజల్లో నానాటికీ ఆదరణ పెరుగుతున్నదని చెప్పారు. అందుకే మోదీ తరచూ ఇండియా కూటమిని ఉద్దేశించి తుప్పపట్టిన పార్టీలు, ఉగ్రవాదులు, అహంకారులు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు.
ప్రధాని అన్ని రకాల ఔచిత్యాలు కోల్పతున్నారనేందుకు ఇది సంకేతమని, ఆయన బాటలోనే బీజేపీ నాయకులు కూడా నడుస్తున్నారని విమర్శించారు. నిజానికి ఈ పోస్టర్ ఉద్దేశం రాహుల్ గాంధీపై హింసను ప్రేరేపించడమేనని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాంరమేశ్ దుయ్యబట్టారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న శక్తుల చేతిలో నానమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్‌గాంధీ ప్రాణత్యాగాలు చేసిన కుటుంబం నుంచి రాహుల్ వచ్చారని ఆయన గుర్తు చేశారు. తనలోని అబద్ధాల కోరును ప్రధాని నిత్యం బయటపెట్టుకుంటూనే ఉన్నారని అన్నారు.
మోదీ నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. తన పార్టీని ఏదో ఉద్ధరిద్దామని ఆయన చేసే చర్యలు ఆమోద యోగ్యం కాదని, అంతేకాకుండా ప్రమాదకరమైనవని చెప్పారు. వీటికి తాము బెదిరిపోయేది లేదని స్పష్టం చేశారు. కొంతమంది 1945లో అగ్రాని పత్రికలో సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ ఇతర కాంగ్రెస్ నాయకుల తలలతో మహాత్మాగాంధీని రావణుడిగా చూపుతూ, వారిపైకి సావర్కర్, శ్యామా ప్రసాద్ ముఖర్జీలను రామలక్ష్మణులుగా చూపుతూ బాణాలు ఎక్కుపెట్టినట్టు ఉన్న కార్టూన్‌ను పోస్ట్ చేశారు. గతంలో మీ పెద్దలు ఇటువంటి కార్టూన్‌ను ప్రచురించారు.
కొన్ని దశాబ్దాల తర్వాత ఇప్పుడు మీరు వారిలో అనేక మందికి తలొంచుతూ, వారిని నెత్తికెక్కించుకున్నారు. ఆనాటి మీ నాయకుల వారసత్వాన్ని మళ్లీ పుణికిపుచ్చుకున్నట్టు ఉన్నారు.. అని కాంగ్రెస్ నాయకుడు గుర్దీప్ సప్పల్ పోస్ట్ చేశారు. కొన్ని రోజులు ఆగితే మళ్లీ సీన్ రిపీట్ అవుతుందని అన్నారు. బీజేపీ పోస్టులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు అతిపెద్ద అబద్దాల కోరు.. జుమ్లా బాయ్‌గా ప్రధాని మోదీ.. అంటూ సినీ పోస్టర్ తరహాలో ఒక చిత్రాన్ని పోస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాధ్రా స్పందిస్తూ.. రాజకీయాలను ఏ స్థాయికి దిగజార్చుతారని మోదీ, జేపీ నడ్డాలను ప్రశ్నించారు.