ఎడారి రాష్ట్రంలో ఎన్నికల వేడి.. 20న రాజస్థాన్‌కు ప్రియాంకగాంధీ
ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయ వేడి రాజుకున్నది.

జైపూర్ : ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయ వేడి రాజుకున్నది. జాతీయ నాయకుల ప్రచార సభలకు అధికార, ప్రతిపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేసేందుకు భారీ ధర్నా, ర్యాలీ నిర్వహించేందుకు అధికార కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు గోవిందసింగ్ డొటాసరా, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తదితర ముఖ్య నేతలు పాల్గొనబోతున్నారు. ప్రధాని మోదీ తూర్పు రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్టు (ఈ.ఆర్.సి.పి) పనులు త్వరలో ప్రాంభిస్తామని ఏడాది క్రితం ఇక్కడ నిర్వహించిన బహిరంగ సభలో హామీ ఇచ్చారు. అయితే.. ఇప్పటికీ పనులు ప్రారంభించలేదు.
దానికి నిరసనగా ప్రజలను జనజాగరణ్ కార్యక్రమానికి తరలిస్తున్నారు. మరోవైపు 20వ తేదీన రాష్ట్ర పర్యటనకు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా రానున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్.. అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నది. మరోవైపు బీజేపీ.. ఎలాగైనా కాంగ్రెస్‌ను గద్దె దించాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నది. ఇక్కడ ప్రధాన పోటీ ఈ రెండు పార్టీల మధ్యే ఉండబోతున్నది. కాంగ్రెస్ ఇప్పటికే ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై భరోసా ఉంచి రంగంలోకి దిగుతుండగా.. మరోవైపు బీజేపీ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజెను కాదని, జైపూర్ రాజకుటుంబానికి చెందిన దియాకుమారిని తెరపైకి తీసుకొచ్చింది.
బీజేపీ తన అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించినా.. కాంగ్రెస్ నుంచి ఇంకా జాబితా రాలేదు. ఇదే అదనుగా సోషల్ మీడియాలో పలువురు బూటకపు జాబితాలను వైరల్ చేస్తున్నారు. 48 పేర్లతో కూడిన బూటకపు జాబితాను కొందరు సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ లిస్టు నకిలీదని కాంగ్రెస్ కొట్టిపారేసింది. ఇంతకు ముందు బీజేపీ ఫేక్ లిస్టు కూడా వెలువడింది.