వీధి కుక్కులు రౌండప్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా!

- ఈ వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే..
విధాత: దేశవ్యాప్తంగా వీధి కుక్కలు బాటసారులను బెంబేలెత్తిస్తున్నాయి. చిన్న పిల్లలను వెంబడిస్తూ కరుస్తున్న కుక్కలు పెద్దవారిని సైతం వదిలిపెట్టడం లేదు. అహ్మదాబాద్‌లో ఇటీవల ఈవినింగ్ వాక్‌కు వెళ్లిన వ్యాపారవేత్త పరాగ్‌దేశాయ్‌పై వీధి కుక్కలు దాడి చేయబోగా, వాటి నుంచి తప్పించుకొనే క్రమంలో కిందపడి మెదడుకు గాయమై చనిపోయారు.
ఆర్థిక రాజధాని ముంబైలోని పొవాయ్ ప్రాంతంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకున్నది. ఓ పోస్ట్‌మ్యాన్‌ను ఐదు వీధి కుక్కలు చుట్టుముట్టాయి. కరిచేసేందుకు మీదకు వచ్చాయి. వెంటనే మరో రెండు కుక్కలు కూడా వాటిని జతకూడాయి. పోస్టుమ్యాన్ తప్పించుకోవడానికి వీలు లేకుండా రౌండప్‌చేసి దాడికి ఎగబడ్డాయి.
కుక్కల అరుపులు విన్న సమీపంలోని సెక్యూరిటీ గార్డ్ వాటిని కట్టెతో తరమడంతో అక్కడి నుంచి పారిపోయాయి. సెక్యూరిటీ గార్డ్ ఆ క్షణంలో అక్కడికి రాకపోయి ఉంటే పోస్టుమ్యాన్‌ను కుక్కలు కరిచి ఉండేవి. పోస్టుమ్యాన్‌ను వీధి కుక్కలు రౌండప్‌చేసిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ రికార్డయ్యాయి. వాటిని సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారాయి.