Ambani Vantara Case : అనంత్ అంబానీ ‘వంతారా’పై సుప్రీంకోర్టు విచారణకు ఆదేశం
సుప్రీంకోర్టు అనంత్ అంబానీ వంతారా జంతు సంరక్షణ కేంద్రంపై SIT దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది. జంతు చట్టాల ఉల్లంఘన ఆరోపణలపై విచారణ జరుగనుంది.

విచారణకు సిట్ ఏర్పాటు
సెప్టెంబర్ 12లోగా నివేదిక సమర్పించాలని గడువు
జంతు చట్టాల ఉల్లంఘన ఆరోపణలపై విచారణ
న్యూఢిల్లీ : ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ నిర్వహిస్తున్న‘వంతారా’ జంతు సంరక్షణ కేంద్రంపై జంతు చట్టాల ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో విచారణకు సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అధ్యక్షతన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ పంకజ్ మిథల్, జస్టిస్ ప్రసన్న బి. వరాలేలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో గల గ్రీన్ జూలాజికల్ రెస్క్యూ, పునరావాస కేంద్రం వంతారాపై నిజనిర్ధారణ విచారణకు ఈ సిట్ ఏర్పాటు చేసినట్లుగా కోర్టు పేర్కొంది. సిట్ తన విచారణ నివేదికను సెప్టెంబర్ 12లోగా అందించాలని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ 15కు వాయిదా వేసింది. భారతదేశంతో పాటు విదేశాల నుండి జంతువులను, ముఖ్యంగా ఏనుగులను తరలిస్తున్నారని..అక్రమంగా నిర్భంధిస్తున్నారని..జంతు చట్టాలను ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణలతో దాఖలైన రెండు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలను సుప్రీంకోర్టు విచారించింది. సాధారణంగా ఇలాంటి పిటిషన్లను తోసిపుచ్చుతామని, కానీ ఈ ఆరోపణలు చట్టబద్ధమైన సంస్థల పనితీరుపైనే సందేహాలు రేకెత్తిస్తున్నందునా.. వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు స్వతంత్ర దర్యాప్తు అవసరమని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపధ్యంలో అనంత్ అంబానీకి చెందిన ‘వంతారా’పై సుప్రీం కోర్టు విచారణకు ఆదేశించింది.
నలుగురితో సిట్
‘వంతారా’కు ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల సిట్ బృందంలో జస్టిస్ చలమేశ్వర్‌తో పాటు, జస్టిస్ (రిటైర్డ్) రాఘవేంద్ర చౌహాన్, ముంబై మాజీ పోలీసు కమిషనర్ హేమంత్ నగ్రాలే, మాజీ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్) అధికారి అనిష్ గుప్తా ఉండనున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. దేశవిదేశాల నుంచి ఏనుగులు సహా ఇతర జంతువులను ఎలా తీసుకొచ్చారు.. వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972, అంతర్జాతీయ నిబంధనలను పాటించారా? లేదా? జంతువులకు అందిస్తున్న వైద్య సదుపాయాలు, ఆర్థిక అవకతవకలు, మనీ లాండరింగ్ వంటి ఆరోపణలపై ఈ సిట్ దర్యాప్తు చేయనుందని సుప్రీంకోర్టు తెలిపింది.
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన ‘మాధురి’ అనే ఏనుగును ఇటీవల వంటారాకు తరలించడంపై స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే సుప్రీంకోర్టులో ఆయా పిటిషన్లు దాఖలయ్యాయి. ఆలయాలు, ప్రైవేటు వ్యక్తుల వద్ద ఉన్న ఏనుగులను, ఇతర అంతరించిపోతున్న జీవులను అక్రమంగా వంటారాకు తరలిస్తున్నారని పిటిషనర్లు ఆరోపించారు. అయితే, న్యాయస్థానం ఆదేశాల మేరకే ‘మాధురి’ని తమ కేంద్రానికి తరలించామని, జంతువులకు సంరక్షణ కల్పించడమే తమ బాధ్యత అని వంటారా యాజమాన్యం గతంలో ఒక ప్రకటనలో వివరణ ఇచ్చింది.