Kolkata rape and murder case । కోల్‌కతా మెడికో హత్యాచారం కేసులో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం

కోల్‌కతాలో మెడికోపై దారుణ లైంగిక దాడి, హత్య ఘటనపై బెంగల్‌ సహా యావత్‌ దేశం అట్టుడికిపోతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు (Supreme Court) కీలక నిర్ణయం తీసుకున్నది.

Kolkata rape and murder case । కోల్‌కతా మెడికో హత్యాచారం కేసులో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం

Kolkata rape and murder case । కోల్‌కతాలో మెడికోపై దారుణ లైంగిక దాడి, హత్య ఘటనపై బెంగల్‌ సహా యావత్‌ దేశం అట్టుడికిపోతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు (Supreme Court) కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ కేసును సుమోటోగా విచారణకు (suo motu cognizance) స్వీకరిస్తున్నట్టు ఆదివారం ప్రకటించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ (Chief Justice of India DY Chandrachud) నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసులో ఆగస్ట్‌ 20న వాదనలు విననున్నది. ఈ బెంచ్‌లో జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా కూడా ఉంటారు. కోల్‌కతా పోలీసులు దర్యాప్తు చేస్తున్న ఈ కేసును ఇటీవలే కలకత్తా హైకోర్టు సీబీఐకి బదిలీ చేసిన విషయం తెలిసిందే.

ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌లో 31 ఏళ్ల పోస్టుగ్రాడ్యుయేట్‌ ట్రైనీ డాక్టర్‌ (post-graduate trainee doctor) ఆగస్ట్‌ 9న లైంగికదాడికి, హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఉదంతం నేపథ్యంలో దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపట్టారు. ఈ నేరంలో భాగం ఉన్న అందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేరంలో ఆత్మహత్య వాదనను ముందుకు తెచ్చిన ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీ (RG Kar Medical College and Hospital) ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌పైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. సందీప్‌ ఘోష్‌ను సీబీఐ (Central Bureau of Investigation (CBI)) అధికారులు వరుసగా మూడో రోజు ఆదివారం కూడా ప్రశ్నించారు. అంతకు ముందు శుక్ర, శనివారాల్లో ఆయనను సీబీఐ సుదీర్ఘ సమయం పాటు ప్రశ్నించింది. 42 మంది సీనియర్‌ డాక్టర్ల బదిలీకి శుక్రవారం ఆదేశాలు జారీ చేసిన బెంగాల్‌ ప్రభుత్వం.. ప్రస్తుతం కొనసాగుతున్న వైద్యుల ఆందోళన నేపథ్యంలో శనివారం వాటిని రద్దు చేసింది. ఇవి ముందే నిర్ణయించినప్పటికీ.. ఈ సమయంలో డాక్టర్ల బదిలీలు సరైంది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో బెంగాల్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.