మూసుకుపోయిన చిన్న దారులు.. ప్రభుత్వ ఏర్పాటులో విజయ్‌కు మిగిలి ఒకే ఒక ఆప్షన్‌ అదే.. కానీ..

మద్దతు ఇస్తాయనుకున్న వామపక్షాలు కుదరదని చెప్పేశాయి. వీసీకే సైతం డౌటే.. కాంగ్రెస్‌ ఒక్కటే ఇప్పటికి బహిరంగంగా విజయ్‌కు మద్దతు ప్రకటించింది. మరిప్పుడు టీవీకే ముందు ఉన్న మార్గాలేంటి?

తమిళనాట ప్రభంజనం సృష్టించిన టీవీకే అధినేత విజయ్‌.. ప్రభుత్వ ఏర్పాటులో సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తమిళనాడు అసెంబ్లీలో 48 గంటల వ్యవధిలో బలపరీక్షలో మెజార్టీ నిరూపించుకోవాలని గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ విజయ్‌కు గడువు విధించారు. తమకు ఐదుగురు కాంగ్రెస్‌ సభ్యులు సహా మొత్తం 113 మంది మద్దతు ఉందని విజయ్‌ తెలియజేయగా.. మెజారిటీకి అవసరమైన 118 మంది సభ్యుల మద్దతు రావాలని గవర్నర్‌ సూచించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా టీవీకే అవతరించిన నేపథ్యంలో బుధవారం విజయ్‌, ఇతర టీవీకే నాయకులు గవర్నర్‌ను కలిసిన సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకున్నది.

సాధారణ మెజార్టీకి టీవీకే దూరంగా ఉన్న నేపథ్యంలో మే 7వ తేదీన విజయ్‌ ప్రమాణం చేస్తారా? లేదా? అన్న సందేహాలు నెలకొంటున్నాయి. 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 108 మంది సభ్యుల మద్దతు అవసరం. టీవీకేకు మరో పది మంది ఎమ్మెల్యేలు కావాల్సి ఉన్నది.

ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల్లో భాగంగా డీఎంకే మిత్ర పక్షాలైన కాంగ్రెస్‌, వీసీకే, సీపీఐ, సీపీఎం, ఐయూఎంఎల్‌ను విజయ్‌ సంప్రదించారు. అయితే.. ఐదుగురు సభ్యులున్న కాంగ్రెస్‌ మాత్రమే అధికారికంగా విజయ్‌కు మద్దతు ప్రకటించింది. తాము డీఎంకే కూటమిలోనే కొనసాగుతామని ఐయూఎంఎల్‌ తేల్చి చెప్పింది. చెరొక రెండు సీట్ల చొప్పున ఉన్న సీపీఐ, సీపీఎం.. విజయ్‌కు మద్దతు ఇచ్చేందుకు నిరాకరించాయి. ఐయూఎంఎల్‌, సీపీఐ, సీపీఎం ఎమ్మెల్యేలు బుధవారం డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌ను అన్నా అరివలయంలో కలుసుకున్నారు. తద్వారా తాము డీఎంకేతోనే కొనసాగుతామని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. డీఎంకే మరో మిత్రపక్షం వీసీకే రెండు చోట్ల విజయం సాధించింది. టీవీకేకు మద్దతు విషయంలో పార్టీ అధినేత థోల్‌ తిరుమావళన్‌దే తుది నిర్ణయమని పార్టీ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. దీంతో ఈ పార్టీ మద్దతు విషయమూ సందేహాస్పదంగానే మారింది. మొత్తం మీద విజయ్‌కు 48 గంటల గడువు ఉంది. ఈలోపులో వామపక్షాలు తమ మనసు మార్చుకుంటాయా? అనేది వేచి చూడాలి.

ఇక విజయ్‌కు మిగిలిన ఏకైక ఆప్షన్‌ అన్నాడీఎంకే మద్దతు తీసుకోవడం. అన్నాడీఎంకే తరఫున 47 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరి మద్దతు ఉంటే.. విజయ్‌ ప్రస్తుతానికి గట్టెక్కినట్టే. రాజకీయ కూటమి ఏర్పాటు విషయంలో బంతి విజయ్‌ కోర్టులోనే ఉందని అన్నాడీఎంకే నాయకుడు కోవై సత్యన్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అంతకు ముందు అన్నాడీఎంకే చీలిపోతుందనే వార్తలు వచ్చాయి. సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు షణ్ముగం కార్యాలయంలో మెజార్టీ ఎమ్మెల్యేలు సమావేశం కావడం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది. అయితే.. పార్టీ చీలిపోయే ప్రసక్తి లేదని, తామంతా ఐక్యంగా ఉన్నామని కోవై సత్యన్‌ చెబుతున్నారు. అందరం ఏకాభిప్రాయంతో ఉన్నామని, ఈ విషయంలో పార్టీ అధిష్ఠానం ఒక నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఇప్పటికే అన్నాడీఎంకేతో పొత్తు పొడిచే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వెలువడుతున్నాయి. అయితే షరతులు ఏముంటాయనేది ఆసక్తికరంగా మారింది.

Latest News