హిమంత బిశ్వశర్మ, ప్రియాంకగాంధీకి ఈసీ నోటీసులు

- ఈ నెల 30లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం
- నేతల కోడ్ ఉల్లంఘటలనపై ఈసీ కొరడా
విధాత: బీజేపీ సీనియర్ నేత, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ప్రియాంక గాంధీ-వాద్రాకు భారత ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. గౌరవ ప్రదమైన పోస్టుల్లో ఉంటూ అనుభవజ్ఞులైన ఇద్దరు ప్రచారకులు తమ ప్రచారంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని పేర్కొన్నది.
ప్రచారంలో శర్మ, ప్రియాంక చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ నిబంధనల కిందికి వస్తాయని తెలిపింది. ఛత్తీస్‌గఢ్ మంత్రికి వ్యతిరేకంగా శర్మ చేసిన వ్యాఖ్యలను ప్రైమా ఫేసీ ఉల్లంఘనగా గుర్తించినట్టు ఈసీ పేర్కొన్నది. రాజస్థాన్ పర్యటనతోపాటు సోషల్ మీడియాలో మోదీపై ప్రియాంక గాంధీ చేసిన పరుష వ్యాఖ్యలకుగాను ఆమెకు నోటీసులు ఇచ్చింది. వీరిద్దరూ ఈ నెల 30 లోగా తమ వ్యాఖ్యలకు కారణాలు తెలపాలని, వివరణ ఇచ్చుకోవాలని సూచించింది.
ఈసీ దూకుడు..
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు నాగాలాండ్ ఉప ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీల నాయకులు ఎన్నికల కోడ్ ఉల్లంఘించకుండా చర్యలు తీసుకుంటున్నది. సీనియర్ అధికారులు ప్రభుత్వ పథకాల ప్రచారాలు నిర్వహించకుండా ఈసీ చర్యలు చేపట్టింది. ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ నాయకులు తీవ్రమైన వ్యాఖ్యలు, ఆరోపణలు ప్రతి ఆరోపణలు తీవ్ర మవుతున్న నేపథ్యంలో వాటిపై కూడా నిఘా పెట్టింది. నాయకులు మంచి ప్రవర్తన, కనీస ప్రమాణాలను పాటించాలని ఈసీ కోరుతున్నది. సోషల్ మీడియాలో ప్రచారాన్ని కూడా పరిశీలిస్తున్నది.