బీహార్‌.. కుల గణన వివరాల ప్రచురణ ఆపలేం: సుప్రీంకోర్టు

బీహార్‌.. కుల గణన వివరాల ప్రచురణ ఆపలేం: సుప్రీంకోర్టు
  • పిటిషన్లు తిరస్కరించిన సుప్రీంకోర్టు


న్యూఢిల్లీ : బీహార్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల గణన వివరాల ప్రచురణను నిలిపివేస్తూ తాము ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీం కోర్టు పేర్కొన్నది. ఒక రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.



బీహార్‌లో కుల సర్వేకు అనుమతి ఇస్తూ ఆగస్ట్‌1న అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టిల ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణను వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది.



ఈ విషయంలో స్పందనను నాలుగు వారాల్లో తెలియజేయాలని బీహార్‌ ప్రభుత్వాన్ని కోరింది. సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కులగణన చేపట్టారని పిటిషనర్లు పేర్కొన్నారు. వివరాల సేకరణ వెనుక చట్టబద్ధమైన లక్ష్యం అంటూ ఏమీ లేదని ఆరోపించారు.



కొంత డాటాను ప్రచురించడం ద్వారా సుప్రీం కోర్టు స్టే ఉత్తర్వులను బీహార్‌ ప్రభుత్వం ఉల్లంఘించిందన్న ఆరోపణలను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ సమయంలో దేనినీ తాము నిలిపివేయలేమని పేర్కొన్నది. విధానపరమైన నిర్ణయాలు తీసుకోకుండా ఏ ప్రభుత్వాన్నీ తాము అడ్డుకోలేమని స్పష్టం చేసింది.