పదేళ్ల తర్వాత మంచిరోజులా?: కపిల్ సిబల్

- రేషన్ పంపిణీ జరుగుతుంటే ఆకలి కేకలేంటి?
- రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ఛత్తీస్ ఘడ్ ఎన్నికల ర్యాలీలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్ పంపిణీ మరో ఐదేళ్లు పొడిగిస్తున్నామని గొప్పగా చెప్పిందానిపై రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబ్బల్ సెటైర్లు వేశారు. పది సంవత్సరాల తర్వాత వచ్చిన మంచి రోజులా ఇవి? అని ఎద్దేవా చేశారు. మంచి రోజులు వస్తాయని పదేళ్ళక్రింద మోదీ అన్నమాటలు మళ్ళీ మోదీకే గుర్తు చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో కపిల్ సిబల్ ఒక పోస్టు చేశారు.
గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో అక్టోబర్ 13, 2023న ఇండియా 125 దేశాల్లో 111వ స్థానంలో ఉంది. మోదీ పనితీరుకు ఇది నిదర్శనమని పలువురు మేధావులు, రాజకీయపార్టీల నాయకులు విమర్శిస్తున్నారు. అయితే.. బీజేపీ నాయకులు మాత్రం ఈ సర్వే తమ ప్రభుత్వాన్ని అప్రదిష్ఠపాలు చేసేందుకే ఉద్దేశించారంటూ కొట్టిపారేశారు. ఈ సర్వేను ప్రస్తావించిన సిబల్.. మోదీ ఉచిత రేషన్ పథకం వల్ల ఇక దేశ ప్రజలు ఆకలితో నిద్రపోరా? అని వ్యాఖ్యానించారు.
80 కోట్ల మంది పేద ప్రజలకు ఉచిత రేషన్ పంపిణీ చేస్తామని మోదీ చెప్పడం కంటే హాస్యాస్పదమైన విషయం మరొకటి ఉందని అన్నారు. ‘అసలు ఈ రేషన్ ఎవరికి పంపిణీ జరుగుతున్నది? క్షేత్రస్థాయిలో ఇది నిజంగా అమలు జరుగుతుంటే మరి హంగర్ ఇండెక్స్‌లో భారత్ దయనీయమైన స్థానంలో ఎలా ఉంది? అని ఆయన ప్రశ్నించారు. మరో ఐదేళ్లు ఉచిత రేషన్ పొడిగించడం అంటే.. రాబోయే రోజులు మనకు మంచిరోజులు అనుకుంటా? అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.