TikTok | ‘టిక్‌టాక్’పై నిషేధం యధాతథం:కేంద్రం స్పష్టీకరణ
TikTok | భారత్‌లో టిక్‌టాక్ నిషేధం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం “టిక్‌టాక్‌పై ఎలాంటినిషేధ ఎత్తివేత ఉత్తర్వులు లేవు” అని స్పష్టం చేసింది. 2020 గల్వాన్ ఘర్షణల తర్వాత సమాచార గోప్యత, భద్రతా కారణాలతో 59 చైనా యాప్‌లతో పాటు టిక్‌టాక్‌ను కూడానిషేధించారు.

TikTok | న్యూఢిల్లీ: భారతదేశంలో టిక్‌టాక్ (TikTok) యాప్‌పై అమల్లో ఉన్న నిషేధం ఎత్తివేశారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ప్రభుత్వం ఖండించింది. “భారత ప్రభుత్వం నుంచి ఎటువంటి నిషేధ ఎత్తివేత ఉత్తర్వులు ఇవ్వలేదు. అలాంటి వార్తలు పూర్తిగా తప్పు, తప్పుదారి పట్టించేలా ఉన్నాయి,” అని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.
కొంతమంది యూజర్లు టిక్‌టాక్ వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయగలిగినప్పటికీ, లాగిన్ అవ్వడం, వీడియోలు చూడడం, కొత్త కంటెంట్ అప్లోడ్ చేయడం సాధ్యం కాలేదు. అంతేకాకుండా యాప్ స్టోర్లలో కూడా టిక్‌టాక్ యాప్ డౌన్‌లోడ్‌కి అందుబాటులో లేదు. టెలికాం శాఖ వర్గాలు తెలిపినట్టు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ISPs) ఇంకా టిక్‌టాక్ యాక్సెస్‌ను బ్లాక్ చేస్తూనే ఉన్నాయి. ఇదే సమయంలో చైనాకు చెందిన ఈ-కామర్స్ యాప్ AliExpress కూడా కొంతమందికి తాత్కాలికంగా పనిచేసింది.
అసలు టిక్‌టాక్‌ను ఎప్పుడు నిషేధించారు?
2020 జూన్ 15న తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్–చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. ఆ ఘటన తర్వాత జూన్ 29, 2020న భారత ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69A కింద 59 చైనా యాప్‌లను, టిక్‌టాక్, అలీఎక్స్‌ప్రెస్ సహా నిషేధించింది.
ఈ యాప్‌లు వినియోగదారుల సమాచార గోప్యతకు ముప్పు కలిగిస్తున్నాయి, సర్వర్ల ద్వారా సమాచారం చైనా ప్రభుత్వానికి లీక్ అయ్యే ప్రమాదం ఉంది, ఇవి స్పైవేర్ లేదా మాల్వేర్లా పనిచేస్తున్నాయి అనిఅప్పట్లో ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. “ఇవి భారతదేశ సార్వభౌమత్వం, భద్రత, ప్రజల మనశ్శాంతి క్షీణించడానికి కారణమవుతున్నాయి” అని కేంద్రం పేర్కొంది.
ఈ మధ్య టిక్‌టాక్ వెబ్సైట్ కొంతసేపు ఓపెన్ అవుతుందని, దాంతో యాప్ తిరిగి వచ్చింది అన్న వార్తలు సోషల్‌మీడియాలో వ్యాప్తి చెందాయి. కానీ ప్రభుత్వం వెంటనే స్పందిస్తూ, “టిక్‌టాక్ ఇంకా నిషేధంలోనే ఉంది. ఎలాంటి అన్‌బ్లాక్ ఆర్డర్ ఇవ్వలేదు,” అని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా, భారత్–చైనా సంబంధాలు మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇరు దేశాలు ఇటీవలే సరిహద్దు శాంతి, వాణిజ్య పునరుద్ధరణ, పెట్టుబడుల ప్రోత్సాహం, నేరుగా విమాన సర్వీసుల పునఃప్రారంభం వంటి అంశాలపై అంగీకరించాయి. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు టియాంజిన్‌లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సులో పాల్గొననున్నారు.
వినియోగదారుల నిరాశ
2020లో నిషేధానికి ముందు టిక్‌టాక్‌కు భారత్‌లోనే 20 కోట్లకు పైగావినియోగదారులు ఉన్నారు. కేవలం వినోదమే కాకుండా, చాలా మంది టిక్‌టాక్ ద్వారా ఉద్యోగాలు, ఆదాయం పొందేవారు.బ్యాన్ చేసినప్పటినుండి అనేకమంది కంటెంట్ క్రియేటర్లు YouTube Shorts, Instagram Reels, Moj, Josh వంటి ప్రత్యామ్నాయ ప్లాట్‌ఫామ్‌లకు మారారు.
అయితే ఇప్పటికీ టిక్‌టాక్ రీఎంట్రీపై ఊహాగానాలు వస్తూనే ఉంటాయి. కానీ ప్రభుత్వం మాత్రం డేటా ప్రైవసీ, జాతీయ భద్రతా అంశాల్లో ఎలాంటి సడలింపు ఇవ్వబోమని తరచూ చెబుతోంది.