ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్, షేక్ షాకత్ హుస్సేన్ ( కాశ్మీర్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ న్యాయ శాస్త్ర ప్రొఫెసర్) పైన 14 ఏళ్ళ క్రితంనాటి ఆరోపణలను సాకుగా చూపిస్తూ నిన్న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె సక్సేనా ఉపా అనే అనాగరిక చట్ట ప్రయోగానికి అనుమతివ్వటం ప్రజాస్వామిక సమాజం తీవ్రంగా ఆక్షేపించదగ్గ విషయమని మానవ హక్కుల వేదిక, తెలంగాణ శాఖ విమర్శించింది
14 ఏళ్లనాటి మాటల పై కేసు నమోదు
ప్రభుత్వ పాలనా విధానానికి పరాకాష్ట
తెలంగాణ మానవహక్కుల వేదిక
విధాత:
ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్, షేక్ షాకత్ హుస్సేన్ ( కాశ్మీర్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ న్యాయ శాస్త్ర ప్రొఫెసర్) పైన 14 ఏళ్ళ క్రితంనాటి ఆరోపణలను సాకుగా చూపిస్తూ నిన్న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె సక్సేనా ఉపా అనే అనాగరిక చట్ట ప్రయోగానికి అనుమతివ్వటం ప్రజాస్వామిక సమాజం తీవ్రంగా ఆక్షేపించదగ్గ విషయమని మానవ హక్కుల వేదిక, తెలంగాణ శాఖ విమర్శించింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వివరాలిలా ఉన్నాయి.
సమాజంలో ప్రజాస్వామ్య సంస్కృతి కోసం ఆరేటపడే అరుంధతి రాయ్ పైన ఉపా కేసుతో కేంద్రప్రభుత్వం తన ఫాసిస్టు రూపానికి చేరుకుంటున్నది.
2010 లో డిల్లీ లో జరిగిన ఒక సదస్సులో వక్తలు చేసిన ఉపన్యాసాలు ప్రజలను రెచ్చగొట్టే విధంగానూ, వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించేవిగానూ ఉన్నాయిని ఒక కాశ్మీరీ పండిట్ చే ఆనాడు ఫిర్యాదు నమోదైంది. ఆ నాటి కేసును తిరగదోడి గత సంవత్సరం ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, ఇవాళ వాటినే ఊపా కేసు పరిధిలోకి తెచ్చారు.
అరుంధతి రాయి లాంటి వ్యక్తలు కాశ్మీర్ ప్రజల సామాజిక, రాజకీయ, రాజ్యాంగ హక్కుల విశ్లేషణ తప్ప మతోన్మాదుల లాగా మాబ్ ని రెచ్చగొట్టే చవకబారు ఉద్రేకపూరిత ఉపన్యాసాలు ఇచ్చే బాపతు కాదు.
ఇప్పటికే ప్రజాస్వామిక వాదులనూ, రచయితలనూ, పేద ప్రజల న్యాయవాదులనూ, అంబేద్కర్ పోరాట వారసులనూ ఈ ఉపా అనే ” తీవ్ర వాద కార్యకలాపాల నిరోధక ” చట్టం కింద కేసులు మోపి, జైళ్ళ పాలు చేశారు.
ఆధునిక నాగరికతకూ, ప్రజాస్వామ్యానికీ, మానవాళి గౌరవప్రద జీవనానికీ గొడ్డలి పెట్టులాగా ఫాసిజం ఒక పరిపాలనా ధోరణిగా భారతదేశంలో జడలు విప్పుతున్నది. అందరం ఒక్కటై ప్రజాస్వామ్యాన్నీ , భావ ప్రకటనా స్వేచ్ఛనూ కాపాడుకుందాం. అరుంధతి రాయి, షేక్ షాకత్ హుస్సేన్ లపై ఉపా ప్రయోగాన్ని తీవ్రంగా వ్యతిరేకిద్దాం. ఇప్పటికే ఉపా కేసులతో వేధించబడుతున్న రచయితల, ప్రజాస్వామిక వాదులపై ఉపా కేసులను ఎత్తివేయాలి. దేశంలోనే ఉపా అనే ప్రత్యేక అనాగరిక చట్టాన్ని రద్దు చేయాలని కోరారు.
**