UPSC | పూజా ఖేడ్కర్‌పై చర్యలకు ఉపక్రమించిన యూపీపీఎస్సీ

ఐఏఎస్‌ ప్రొబేషనర్‌ పూజా ఖేడ్కర్‌పై యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ శుక్రవారం కేసు నమోదు చేసింది. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష 2022 నుంచి ఆమె అభ్యర్థిత్వాన్ని ఎందుకు రద్దు చేయకూడదో, భవిష్యత్తులో జరిగే పరీక్షలకు హాజరుకాకుండా ఎందుకు నిషేధించకూడదో తెలియజేయాలంటూ షోకాజ్‌ నోటీసు జారీ చేసింది

UPSC | పూజా ఖేడ్కర్‌పై చర్యలకు ఉపక్రమించిన యూపీపీఎస్సీ

న్యూఢిల్లీ: ఐఏఎస్‌ ప్రొబేషనర్‌ పూజా ఖేడ్కర్‌పై యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ శుక్రవారం కేసు నమోదు చేసింది. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష 2022 నుంచి ఆమె అభ్యర్థిత్వాన్ని ఎందుకు రద్దు చేయకూడదో, భవిష్యత్తులో జరిగే పరీక్షలకు హాజరుకాకుండా ఎందుకు నిషేధించకూడదో తెలియజేయాలంటూ షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. పూజా మనోరమా దిలిప్‌ ఖేడ్కర్‌ దుష్ప్రవర్తనపై సమగ్ర విచారణ జరిపామని కమిషన్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించి తన పేరు, తన తల్లిదండ్రుల పేర్లు, ఫొటో, సంతకం, ఈమెయిల్‌ ఐడీ, మొబైల్‌ నంబర్‌, చిరునామాను మార్చి అవకతవకలకు పాల్పడినట్టు తేలిందని పేర్కొంది. దీంతో ఆమెపై వరుస చర్యకు ఉపక్రమిస్తున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగానే ఆమెపై పోలీసు కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నది. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష అభ్యర్థిత్వాన్ని ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ షోకాజ్‌ నోటీ జారీ చేశామని తెలిపింది. అదే విధంగా భవిష్యత్తులో ఎలాంటి పరీక్షలకు హాజరుకాకుండా నిషేధించే విషయంలోనూ నోటీ జారీ చేశామని పేర్కొన్నది. యూపీపీఎస్సీ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు పూజా ఖేడ్కర్‌పై మోసం, వంచన, ఫోర్జరీ అభియోగాలతో ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు.
పూజా ఖేడ్కర్‌ వ్యవహారాలపై అంతకు ముందు బుధవారం (జూలై 18) మహారాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి నితిన్‌ గడ్రే తన నివేదికను కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, శిక్షణ శాఖకు సమర్పించింది. ఈ కేసులో విచారణ జరుపుతున్న అదనపు కార్యదర్శి మనోజ్‌ ద్వివేదీ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్‌కు సైతం నివేదికను పంపారు. తన సొంత ఆడి కారుకు ఎర్ర బల్బును పెట్టుకుని హాజరుకావడం, ఒక సీనియర్‌ ఆఫీసర్‌ కార్యాలయాన్ని ఉపయోగించుకున్న విషయంలో ఆయనతో వివాదం నేపథ్యంలో ఆమె అవకతవకలు ఒక్కొక్కటి వెలుగులోకి వచ్చాయి.