TVK Vijay Video | కరూర్ దుర్ఘటనపై విజయ్ భావోద్వేగ సందేశం: వీడియో విడుదల
కరూర్‌లో టీవీకే ర్యాలీ సందర్భంగా జరిగిన దుర్ఘటనపై విజయ్ తొలి స్పందన. ప్రజల భద్రతే ముఖ్యం అని, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన విజయ్. ఎన్డిఏ–బీజేపీ నేతలు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ డిమాండ్.

Vijay’s Emotional Response on Karur Tragedy: “My Heart is Full of Pain”
చెన్నై, సెప్టెంబర్ 30:
TVK Vijay Video | తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, ప్రముఖ నటుడు విజయ్, కరూర్‌లో జరిగిన దుర్ఘటన తన జీవితంలో అత్యంత బాధాకరమైన సంఘటన అని తొలిసారి ప్రజలకు వీడియో సందేశం ఇచ్చారు. సెప్టెంబర్ 27న కరూర్‌లో జరిగిన టీవీకే ర్యాలీలో తొక్కిసలాటలో 41 మంది మరణించిన ఈ ఘటనపై విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “నా హృదయం భరించలేని వేదనతో నిండిపోయింది. ర్యాలీకి వచ్చిన ప్రజల ప్రేమ, అభిమానం చూస్తే గుండె బరువెక్కింది” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
నాకు ప్రజల భద్రతే ముందు : విజయ్
విజయ్ తన సందేశంలో, ర్యాలీల్లో ప్రజల భద్రతకు తాను ఎల్లప్పుడూ ప్రాధాన్యమిచ్చానని స్పష్టం చేశారు. రాష్ట్ర పర్యటనల్లో ప్రజల భద్రత కంటే ఏదీ ముఖ్యం కాదు. రాజకీయ కారణాలను పక్కనపెట్టి, సరైన వేదికలను ఎంచుకొని, అనుమతుల కోసం పోలీసులను సంప్రదించామని తెలిపారు. అయినప్పటికీ, అనుకోకుండా ఈ దుర్ఘటన జరిగిందని, తాను కూడా మనిషినేనని, ఈ సంఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. అంతమంది ప్రజలు బాధలో ఉండగా, తాను ఆ పట్టణాన్ని వదిలి వెళ్లలేకపోయానని, కానీ అక్కడికి తిరిగి వెళితే ఉద్రిక్తతలు మరింతగా పెరిగే అవకాశం ఉండేదని తెలిపారు.
— TVK Vijay (@TVKVijayHQ) September 30, 2025
విజయ్ మృతుల కుటుంబాలకు తన హృదయపూర్వక సానుభూతి తెలిపారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ ఘటనను అర్థం చేసుకొని, తమకు మద్దతుగా నిలిచిన రాజకీయ నాయకులు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇతర జిల్లాల్లో ర్యాలీలు సజావుగా జరిగాయని, కేవలం కరూర్‌లోనే ఈ దుర్ఘటన ఎందుకు జరిగిందని విజయ్ ప్రశ్నించారు. తమ పార్టీ నిర్వాహకులు, సోషల్ మీడియా మద్దతుదారులపై కేసులు నమోదు చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎలాంటి తప్పూ చేయలేదనీ, ఎవరిపైనైనా చర్యలు తీసుకోవాలనుకుంటే తన మీద తీసుకోండంటూ ముఖ్యమంత్రిని కోరారు. ఈ ఘటన తమ రాజకీయ ప్రస్థానాన్ని ఆపలేదని, మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతామని విజయ్ స్పష్టం చేశారు.
ఎన్‌డీఏ-బీజేపీ నిజనిర్ధారణ బృందం పర్యటన
ఎన్‌డీఏ-బీజేపీ నేతృత్వంలోని ఎనిమిది మంది సభ్యుల బృందం కరూర్‌ను సందర్శించి, బాధితులు, గాయపడిన వారిని కలిసింది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ జరపాలని డిమాండ్ చేసింది. బీజేపీ ఎంపీ హేమమాలిని, నిర్వాహణలో లోపాలు, సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం, ఇరుకైన వేదిక ఎంచుకోవడంపై తప్పుబట్టారు. 30,000 మంది ప్రజలను ఇంత ఇరుకైన ప్రదేశంలోకి అనుమతించడం సరికాదని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని ఆమె ప్రభుత్వాన్నికోరారు.
దుర్ఘటన ఎలా జరిగింది?
కరూర్‌లో విజయ్ ర్యాలీకి 50,000 మందికి పైగా హాజరయ్యారు. ఓ తొమ్మిదేళ్ల బాలిక కనిపించకపోవడంతో ఆందోళన చెందిన ప్రజలు పాప కోసం ఒకే వైపుకు వెళ్లగా, తొక్కిసలాట మొదలైంది. ఈ గందరగోళంలో 41 మంది మరణించారు. పలువురు పార్టీ కార్యకర్తలు, చిన్నారులు సొమ్మసిల్లిపోయారు. విజయ్ వెంటనే తన ప్రసంగాన్ని ఆపి, శాంతించాలని, అంబులెన్స్‌లకు దారివ్వాలని ప్రజలను కోరారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై విచారణ కమిషన్ దర్యాప్తు చేస్తుందని తెలిపారు.