Vijay Rally Stampede | కరూర్ విషాదం : TVK నాయకుడి అరెస్ట్ – 41కి పెరిగిన మృతుల సంఖ్య
తమిళనాడు కరూర్‌లో విజయ్ సభలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 41కి పెరిగింది. వందల మందికి గాయాలు అయ్యాయి. పోలీసులు TVK నేతను అరెస్ట్ చేశారు. విజయ్‌పై కూడా FIR నమోదైంది. పూర్తి వివరాలు.

Vijay’s Karur Rally Tragedy: 41 Dead, TVK leader Mathiyazhagan arrested
చెన్నై, సెప్టెంబర్ 29(విధాత):
Vijay Rally Stampede | తమిళనాడు కరూరులో నటుడు-రాజకీయవేత్త విజయ్ ర్యాలీలో జరిగిన ఘోర విషాద ఘటనలో మృతుల సంఖ్య 41కి పెరిగింది. సంఘటన జరిగిన 48 గంటల తర్వాత, పోలీసులు TVK కరూర్ వెస్ట్ జిల్లా సెక్రటరీ మథియాజగన్‌ను అరెస్ట్ చేసినట్లు ది హిందూ పత్రిక తెలిపింది. ఈ దుర్ఘటనకు కారణమైన నిర్లక్షానికి అతడు బాధ్యుడని పోలీసులు తెలిపారు. హత్యాయత్నం, హత్యకు సమానమైన నేరం, ప్రజా భద్రతను ప్రమాదంలో పడేయడం వంటి సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదైంది. TVK జనరల్ సెక్రటరీ బస్సీ ఆనంద్, జాయింట్ సెక్రటరీ నిర్మల్ శేఖర్‌లపై కూడా కేసులు నమోదయ్యాయి.
కరూర్‌లో ఆరోజు ఏం జరిగింది?
శనివారం కరూర్‌లో జరిగిన విజయ్ ర్యాలీకి 35 వేల మందికి పైగా జనం తండోపతండాలుగా తరలివచ్చారు. 10 వేల మంది మాత్రమే వస్తారని ఊహించి అనుమతి తీసుకున్నా, మూడు నాలుగు రెట్ల సంఖ్యలో జనం గుమిగూడారు. ఎండలో గంటల తరబడి ఆహారం, నీరు లేకుండా ఎదురుచూసిన జనం బలహీనపడ్డారు. విజయ్ కరూరుకు చేరుకున్నా, తన రాజకీయ బలం చూపించాలని ర్యాలీకి ఏడు గంటలు ఆలస్యంగా వచ్చాడని ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపణ. అనుమతి లేకుండా రోడ్‌షో చేశాడని, కార్యకర్తల్లో అనవసర ఆశలు కలిగించాడని, పోలీసు హెచ్చరికలను పట్టించుకోలేదని పేర్కొన్నారు. జనంలో తోపులాట జరగడంతో బ్యారికేడ్‌లు విరిగిపోయాయి. షెడ్డులు, చెట్లపై ఎక్కినవారు అవి కూడా కూలిపోవడంతో గందరగోళం ఏర్పడి తొక్కిసలాట జరిగింది. అప్పుడు మరణించిన 36 మందిలో 10 మంది పిల్లలు, 18 మంది మహిళలు ఉన్నారు. 60 మంది గాయపడ్డారు.
పోలీసు ఆరోపణలు, TVK ప్రతిస్పందన
విజయ్ రాజకీయ బలం చూపించడానికి ఆలస్యం చేసి జనంలో అసహనం కలిగించాడని, అనుమతి లేని రోడ్‌షో నిర్వహించాడని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. దీని వల్ల విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగాయని, TVK అధికారులు షరతులను ఉల్లంఘించారని నివేదికలో ఆరోపించారు. TVK నాయకుడు ఆదావ్ అర్జున మద్రాస్ హైకోర్టులో సీబీఐ విచారణ కోరారు. విజయ్ బాధిత కుటుంబాలను కలవకుండా ప్రభుత్వం అడ్డుకోకుండా కోర్టు ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేసారు. ఈ ఘటన వెనుక డిఎంకే కుట్ర ఉందని టివికే ఆరోపించగా, డిఎంకే తిరస్కరించింది.
మద్రాస్ హైకోర్టు TVK పిటిషన్‌పై సాయంత్రం 4:30 గంటలకు అత్యవసర విచారణ జరిపింది. డిఎంకే విద్యార్థి సంఘాలు విజయ్ నివాసం వద్ద నిరసనలు నిర్వహించాయి. విజయ్ ఈ ఘటనపై, నా గుండె పగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేసారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, గాయపడినవారికి రూ.2 లక్షలు పరిహారం ప్రకటించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. TVK అన్ని విధాలా పోలీసు నిబంధనలు పాటించినట్లు వారి అడ్వకేట్ తెలిపారు. ఈ దుర్ఘటన TVK బాధ్యత, పోలీసుల వైఫల్యంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.