Chiranjeevi Fans on Fire | బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి అభిమానుల ఆగ్రహం

ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. చిరంజీవి అభిమానులు పెద్ద ఎత్తున నిరసనలు, ఫిర్యాదులకు సిద్ధమయ్యారు. కానీ మెగాస్టార్ విజ్ఞప్తి మేరకు వెనక్కి తగ్గారు. పూర్తి వివరాలు.

Chiranjeevi Fans on Fire | బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి అభిమానుల ఆగ్రహం

Balakrishna’s Comments on Chiranjeevi in AP Assembly Spark Fan Outrage, Megastar Urges Calm

  • జూబ్లీహిల్స్ బ్లడ్ బ్యాంక్‌లో చిరంజీవి అభిమానుల అత్యవసర సమావేశం

విధాత, విజయవాడ/హైదరాబాద్‌:

Chiranjeevi Fans on Fire | అసెంబ్లీలో జరిగిన ఈ సంఘటనతో చిరంజీవి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్​ శాసనసభలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఉద్దేశ్యపూర్వకంగానే చిరంజీవిని అవమానించారని వారు ఆవేదన వ్యక్తం చేసారు. దీన్ని ఇంతటితో వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్న వందలాది మంది అభిమాన సంఘాల నేతలు జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సమావేశాలనికి ఐదు రాష్ట్రాల నుంచి  అభిమానులు తరలివచ్చారు. పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాలని, వందల సంఖ్యలో పోలీస్‌స్టేషన్లలో బాలకృష్ణపై ఫిర్యాదులు ఇవ్వాలని అభిమానులు నిర్ణయం తీసుకున్నారు.

ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి అభిమానుల నిరసన – జూబ్లీహిల్స్ బ్లడ్ బ్యాంక్ వద్ద సమావేశం

కాగా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇటీవల చర్చ సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్​ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యలపై చర్చించేటపుడు బాలకృష్ణ, సీఎం జగన్‌ను “సైకో” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో సినీ ప్రముఖులు జగన్‌ను కలిసిన అంశం కూడా చర్చకు వచ్చింది. దీనిలో భాగంగా చిరంజీవి పేరు ప్రస్తావిస్తూ బాలకృష్ణ ఎవడూ.. అంటూ చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానుల్లో తీవ్ర ఆగ్రహం కలిగించాయి.

బాలకృష్ణ వ్యాఖ్యలపై వెంటనే మెగాస్టార్ చిరంజీవి ఓ బహిరంగ లేఖ ద్వారా స్పందించారు.
“నేను అప్పటి ముఖ్యమంత్రి జగన్‌ను ఇండస్ట్రీ ప్రతినిధులతో కలిసి కలిశాను. టికెట్ ధరల పెంపు, ఇతర సమస్యలు వివరించాను. ఆ ప్రయత్నాల వల్ల అనేక సినిమాలకు ప్రయోజనం కలిగింది. వాస్తవాలను వక్రీకరించడం గౌరవానికి తగదు” అని ఆయన స్పష్టం చేశారు. జగన్​తో సినీపెద్దల సమావేశానికి హాజరైన నటుడు నారాయణమూర్తి కూడా చిరంజీవికి మద్దతు పలికారు. చిరంజీవి చెప్పింది అక్షరాల నిజమని స్పష్టం చేసారు.

ఇది మన సంస్కారం కాదు – చిరంజీవి విజ్ఞప్తి

అభిమానుల ఆగ్రహావేశాల విషయం తెలుసుకున్న చిరంజీవి, అభిమానులను శాంతించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు:
“అది మన సంస్కారం కాదు. మనం ఎప్పుడూ శాంతి మార్గంలోనే ముందుకు సాగాలి. ఫిర్యాదులు, నిరసనలు అవసరం లేదు. మీరు చూపుతున్న ఆవేశం అర్థం అవుతోంది, కానీ దయచేసి విరమించుకోండి” అని చెప్పారు.

మెగాస్టార్ విజ్ఞప్తిని గౌరవించి అభిమాన సంఘాల నేతలు వెంటనే నిరసనలు, ఫిర్యాదుల ప్రయత్నాల నుంచి వెనక్కి తగ్గారు.