Vijay Rally Stampede | తమిళనాడులో ఘోర విషాదం – విజయ్​ ర్యాలీలో తొక్కిసలాటకు 36 మంది బలి

కరూర్‌లో విజయ్‌ TVK సభలో భారీ తొక్కిసలాట. 36 మంది మృతి, 8 చిన్నారులు, 16 మహిళలు ప్రాణాలు కోల్పోయారు. సీఎం స్టాలిన్ పరిహారం ప్రకటించగా, ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.

Vijay Rally Stampede | తమిళనాడులో ఘోర విషాదం – విజయ్​ ర్యాలీలో తొక్కిసలాటకు 36 మంది బలి
  • టివికే అధ్యక్షుడు ఆలస్యంగా రావడం ప్రధాన కారణం
  • నిర్వాహకులు జనాన్ని అంచనా వేయడంలో విఫలం
  • పోలీసుల భద్రతావైఫల్యం మరో కారణం
  • విజయ్​పై పోలీసులు కేసు నమోదు

Karur Tragedy: 36 Killed in Stampede at Vijay’s TVK Rally, Safety Concerns Raised

కరూర్‌ (తమిళనాడు):

Vijay Rally Stampede | తమిళ సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్‌ నిర్వహించిన ప్రచార సభలో నేటి రాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది.  అక్కడ జరిగిన తొక్కిసలాటలో 38 మంది మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. ఇందులో పిల్లలు, మహిళలు కూడా ఉండటం పెను విషాదం. వేలుస్వామిపురం మైదానంలో జరిగిన సభకు అంచనాలకు మించి జనం తరలివచ్చారు. పోలీసుల వద్ద 10 వేలమందికి మాత్రమే అనుమతి తీసుకున్న నిర్వాహకులు జనం ఉవ్వెత్తున తరలిరావడంతో  సభాప్రాంగణం క్రిక్కిరిసిపోయింది. దాదాపు 50వేల మంది గుమిగూడారని పోలీసుల అంచనా.

ర్యాలీకి  విజయ్​ రాక ఆలస్యమే కొంపముంచింది

Karur Tragedy: 36 Killed in Stampede at Vijay’s TVK Rally, Safety Concerns Raised

య 12 గంటలకు జరగాల్సిన సభ సాయంత్రం 7.45 గంటలకు మాత్రమే ప్రారంభమైంది. విజయ్‌ రాకలో ఏడు గంటల ఆలస్యం జరగడం వల్ల జనం ఉత్సాహం అదుపు తప్పింది. పైగా అంతసేపు నీరు, ఆహారం లేని పిల్లలు, వృద్ధులు, మహిళలు నీరసపడిపోయి తోపులాటను తట్టుకోలేక కిందపడిపోయారని తెలుస్తోంది. వేదిక వద్దకు చేరుకున్న వెంటనే అభిమానులు ముందుకు దూసుకెళ్లగా, కొందరు సమీప భవంతి పిట్టగోడలపైకి ఎక్కారు. ఒక గోడ కూలిపోవడంతో ఒక్కసారిగా తోపులాట మొదలై, తొక్కిసలాటకు దారి తీసింది.

ఈ ఘటనలో 38 మంది మృతి చెందగా, వారిలో 10 మంది చిన్నారులు, 17మంది మహిళలు ఉన్నారని ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. మరో 50 మందికిపైగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడినవారిని అంబులెన్సుల ద్వారా కరూర్‌ మెడికల్ కాలేజీ ఆసుపత్రి మరియు సమీప ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. సభ వేదికపై విజయ్‌ పరిస్థితి గమనించి వెంటనే ప్రసంగాన్ని ఆపేసి, “పోలీస్… ప్లీజ్ హెల్ప్” అంటూ విజ్ఞప్తి చేశారు. అయితే గందరగోళాన్ని నియంత్రించడానికి సమయం పట్టింది. ఆఖరికి అంబులెన్స్​లకు కూడా దారిలేని పరిస్థితి ఏర్పడింది.

ఈ విషాదంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాత్రి కరూర్‌కు చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, తీవ్రంగా గాయపడినవారికి రూ.1 లక్ష పరిహారం ప్రకటించారు. అలాగే రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి అరుణా జగదీశన్‌ ఆధ్వర్యంలో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. కరూర్‌, తిరుచ్చి, సేలం, దిండిగల్ జిల్లాల కలెక్టర్లను సహాయక చర్యల్లో భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు.

ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బీజేపీ నేత అన్నమలై, సినీ నటుడు రజనీకాంత్‌ తదితరులు తమ సంతాపాన్ని తెలియజేశారు.

ఈ ఘటనతో భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అనుమతికి మించి జనసంద్రం తరలివచ్చినా, తగిన నియంత్రణ చర్యలు లేకపోవడం విమర్శలకు దారితీసింది. తాగునీటి సదుపాయం, సరైన ఓపెన్ స్పేస్ లేకపోవడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనే మద్రాస్ హైకోర్టు, TVK ర్యాలీల్లో జనం అదుపుతప్పితే బాధ్యత పార్టీ అధ్యక్షుడిగా విజయ్‌దేనని హెచ్చరించింది.  ఆ హెచ్చరిక ఇప్పుడు వాస్తవమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, టివికే అధ్యక్షుడు, సినీనటుడు విజయ్​పై పోలీసులు కేసు నమోదు చేసారు.

ఈ విషాదం అనంతరం విజయ్‌ సభ వేదికనుంచి నేరుగా తిరుచ్చి విమానాశ్రయానికి వెళ్లి చెన్నైకి చేరుకున్నారు. మీడియా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా, తన ముఖాన్ని తిప్పుకుని వెళ్లిపోయారు. ఈ ఘటనపై ఆయన ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అభిమానుల ఉత్సాహం, నిర్వాహకుల నిర్లక్ష్యం, భద్రతా లోపాలు అన్నీ కలగలిసి రావడంతో చిన్నారులు సహా 36 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ సంఘటన తమిళనాడును విషాదంలో ముంచెత్తింది.