demolition of properties । రోడ్ల మధ్య ఆలయాలు, మసీదుల కూల్చివేతలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
బహిరంగ ప్రదేశాలు, రోడ్లు, ఫుట్‌పాత్‌లు, ప్రభుత్వ భూములు, అడవులు, నీటి వనరులు, చెరువులు వంటి చోట్ల ఉండే ఆక్రమణలను ఎట్టిపరిస్థితుల్లోనూ సుప్రీంకోర్టు రక్షించబోదని స్పష్టం చేశారు. తాము జారీ చేసే మార్గదర్శకాలు యావత్ దేశానికి వర్తిస్తాయని పేర్కొన్నారు.

demolition of properties । రోడ్ల మధ్యలో ఉండే ప్రార్థనా స్థలాల కూల్చివేతలపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. అవి ఆలయాలైనా, దర్గాలైనా వీటిపై యావత్ దేశానికి వర్తించేలా మార్గదర్శకాలను జారీ చేస్తామని వెల్లడించింది. ప్రజా ప్రయోజనాలే అన్నింటికంటే ముఖ్యమని వ్యాఖ్యానించింది. ఒకరు నిందితులనో లేదా కేసులో దోషిగా తేలినందుకో వారి ఇళ్లను కూల్చివేయడం తగదని సుప్రీంకోర్టు పేర్కొన్నది. అనేక రాష్ట్రాల్లో వివిధ కేసులలో నిందితులవి సహా ఇళ్లను కూల్చివేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. అక్రమంగా నిర్మించి ఉంటే కులమతాలకు అతీతంగా వాటిని కూల్చివేయాల్సిందేనని జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. తమ అనుమతి లేకుండా అక్టోబర్ 1 వరకూ ఎలాంటి కూల్చివేతలు చేపట్టొద్దని సెప్టెంబర్ 17 నాటి ఉత్తర్వుల్లో సుప్రీం ధర్మాసనం ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే.. తమ తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ అవి కొనసాగుతాయని బెంచ్ తెలిపింది.
‘మేము ఏది నిర్దేశిస్తున్నా మనది లౌకిక దేశం. ఏ నిర్దిష్ట వర్గానికో కాకుండా పౌరులందరికీ, అన్ని సంస్థలకు మేం ఉత్తర్వులు జారీ చేస్తున్నాం’ అని న్యాయమూర్తులు తెలిపారు. నిర్దిష్ట మతానికి విభిన్న చట్టం ఉండదని వ్యాఖ్యానించారు. బహిరంగ ప్రదేశాలు, రోడ్లు, ఫుట్‌పాత్‌లు, ప్రభుత్వ భూములు, అడవులు, నీటి వనరులు, చెరువులు వంటి చోట్ల ఉండే ఆక్రమణలను ఎట్టిపరిస్థితుల్లోనూ సుప్రీంకోర్టు రక్షించబోదని స్పష్టం చేశారు. తాము జారీ చేసే మార్గదర్శకాలు యావత్ దేశానికి వర్తిస్తాయని పేర్కొన్నారు. ఆక్రమణదారులకు తమ ఉత్తర్వులు సహకరించకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. కూల్చివేతలకు, అంతకు ముందు జారీ చేసే నోటీసులకు మధ్య పది లేదా పదిహేను రోజుల వ్యవధి ఉండేలా అధికారులు చూసుకోవాలని, తద్వారా ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటారని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. మహిళలు, చిన్నపిల్లలు రోడ్డున పడటం చూడలేమన్న కోర్టు.. పదిహేను రోజులు ఆగి కూల్చివేసింత మాత్రాన నష్టం ఏమీ ఉండదని వ్యాఖ్యానించింది.