AP MLC అభ్యర్థుల ఖరారు

AP MLC
విధాత: ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది. 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా జనసేన, బీజేపీలకు చెరొక స్థానం కేటాయించారు. టీడీపీ అభ్యర్థులుగా మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కూతురు కావలి గ్రీష్మ (ఎస్సీ), యాదవ సామాజిక వర్గానికి చెందిన బీదర్ రవి చంద్ర యాదవ్ లను అభ్యర్థులుగా ఖరారు చేశారు. బోయ సామాజిక వర్గానికి చెందిన బీటీ నాయుడుకు మరొక అవకాశం ఇచ్చారు. ప్రతిభా భారతి కుటుంబం నుంచి మూడో తరం నాయకురాలుగా కావలి గ్రీష్మ చట్టసభలలో అడుగు పెట్టనుండటం విశేషం.
జనసేన ఇప్పటికే తమ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన తన నామినేషన్ సైతం దాఖలు చేశారు. బీజేపీకి కేటాయించిన స్థానానికి ఆ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు సోమవారంతో ముగిసి పోనుంది. 20వ తేదీన పోలింగ్ నిర్వహించి అదే రోజు సాయంత్రం ఫలితాలు విడుదల కానున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీలో వున్న సంఖ్య పరంగా చూస్తే ఈ ఐదు స్థానాలు కూటమి సర్కారుకే దక్కే అవకాశాలు వున్నాయి.