Ceat: మార్కెట్లోకి.. కొత్త టైర్లు! గంటకు 300Kmల వేగం.. పంక్చర్ అయినా డోంట్ వర్రీ

  • By: sr    news    Mar 20, 2025 9:20 PM IST
Ceat: మార్కెట్లోకి.. కొత్త టైర్లు! గంటకు 300Kmల వేగం.. పంక్చర్ అయినా డోంట్ వర్రీ

అధునాతన స్పోర్ట్‌డ్రైవ్ శ్రేణిని ఆవిష్కరించిన సియట్

Automobile | Ceat

ముంబై: సాధారణంగా ఏ వాహన వేగమైన దాని ఇంజిన్‌తోపాటు వాహనానికి వాడిన టైర్లపై ఆధారపడి ఉంటుంది. అయితే సియట్ తాజాగా ఆవిష్కరించిన టైర్లు ఏకంగా గంటకు 300 కి.మీ. ల వేగాన్ని తట్టుకోగలవు. భారత్‌లో దిగ్గజ టైర్ల తయారీ సంస్థ సియట్ తాజాగా తమ స్పోర్ట్‌డ్రైవ్ శ్రేణిలో మూడు అధునాతన ఉత్పత్తులను ఆవిష్కరించింది. అల్ట్రా-హై పెర్ఫార్మెన్స్, లగ్జరీ ఫోర్-వీలర్ సెగ్మెంట్లో కంపెనీ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. అలాగే, రన్-ఫ్లాట్ టైర్లను, CALM టెక్నాలజీతో 300 KMPHకి మించిన వేగాన్ని కూడా తట్టుకోగలిగే సామర్థ్యాలు గల 21-అంగుళాల ZR రేటెడ్ టైర్లను తయారు చేసే తొలి భారతీయ టైర్ల తయారీ సంస్థగా సియట్ నిల్చింది. తద్వారా భారతీయ ఆటోమోటివ్ తయారీ సామర్థ్యాల్లో కీలక మైలురాయిని చేరుకుంది.

జర్మనీలోని అంతర్జాతీయ ఆటోమోటివ్ ప్లాంట్లలో ఎన్నో కఠినమైన పరీక్షలను ఎదుర్కొన్న ఈ తాజా ఉత్పత్తులు, పనితీరు, భద్రత రీత్యా అత్యుత్తమ ప్రమాణాలను కలిగి ఉన్నాయి. “కొత్త స్పోర్ట్‌డ్రైవ్ టైర్ల శ్రేణి కింద ZR రేటెడ్ టైర్లు, CALM టెక్నాలజీ మరియు రన్-ఫ్లాట్ టైర్ల ఆవిష్కరణతో ప్రీమియం, టెక్నాలజీ ఆధారిత బ్రాండ్‌గా సియట్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోనుంది. లగ్జరీ, హై-పెర్ఫార్మెన్స్ వాహనాల యజమానులకు మెరుగైన భద్రత, సౌకర్యం, పనితీరును అందించాలన్న మా నిబద్ధతకు ఈ ఆవిష్కరణలు నిదర్శనంగా నిలుస్తాయి. ఫోర్ వీలర్ టైర్ల సెగ్మెంట్లో మా అగ్రస్థానాన్ని నిలబెట్టుకునేలా రన్ ఫ్లాట్ టైర్లను ప్రవేశపెట్టిన తొలి భారతీయ కంపెనీగా నిలవడం గర్వకారణం” అని సియట్ ఎండీ, సీఈవో అర్ణబ్ బెనర్జీ తెలిపారు.

లగ్జరీ ప్రమాణాలు..

“టైర్ ఇంజినీరింగ్‌లో శ్రేష్ఠతను సాధించే దిశగా నిరంతరం మేము చేస్తున్న కృషికి తాజా ఆవిష్కరణలు నిదర్శనంగా నిలుస్తాయి. ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ వాహనాల యజమానులు కోరుకునే ప్రమాణాలతో టైర్లను అందించాలనే మా నిబద్ధతకు అనుగుణంగా రన్-ఫ్లాట్ టైర్లు, CALM టెక్నాలజీ గల ZR రేటెడ్ టైర్లతో స్పోర్ట్‌డ్రైవ్ సరికొత్త శ్రేణి ఆవిష్కరించాం. జర్మనీలోని ప్లాంట్లో అనేక పరీక్షలు జరిపిన తరువాతే మార్కెట్లోకి విడుదల చేస్తున్నాం” అని సియట్ సీఎంవో లక్ష్మీ నారాయణన్ B. తెలిపారు.

సియట్ సరికొత్త ప్రీమియం టైర్ల శ్రేణి ఏప్రిల్ నుంచి ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై, కోల్‌కతా, పుణె, చండీగఢ్, ఉత్తర్ ప్రదేశ్, బెంగళూరు, తమిళనాడు, కోయంబత్తూరు, మధురై, కేరళ, హైదరాబాద్, గువాహటి,, అహ్మదాబాద్‌లాంటి కీలక మార్కెట్లలో అందుబాటులో ఉంటుంది. రన్‌-ఫ్లాట్ టైర్ల ధర రూ. 15,000 నుంచి రూ. 20,000 దాకా ఉంటుంది. అలాగే, 21 అంగుళాల ZR రేటెడ్ అల్ట్రా-హై-పెర్ఫార్మెన్స్ CALM టెక్నాలజీ టైర్ల ధర రూ. 25,000 నుంచి రూ. 30,000 వరకు ఉంటుంది.

అధునాతన టెక్నాలజీ వాడకం..

  • హై-పెర్ఫార్మెన్స్ మొబిలిటీలో సియట్ బ్రాండ్ అనుభవానికి ZR రేటెడ్ 21 అంగుళాల టైర్లు నిదర్శనంగా ఉంటాయి. 300 KMPHకి మించిన వేగాన్ని కూడా తట్టుకునేలా రూపొందించబడిన ఈ అల్ట్రా-హై-పెర్ఫార్మెన్స్ (UHP) టైర్లు, అత్యధిక వేగాల్లో కూడా అత్యుత్తమ గ్రిప్, కంట్రోల్, స్థిరత్వాన్ని అందిస్తూ లగ్జరీ వాహనాలకు అనువైనవిగా ఉంటాయి.
  • CALM టెక్నాలజీ వల్ల ఇన్-క్యాబిన్ నాయిస్ గణనీయంగా తగ్గుతుంది. ప్యాసింజర్లు ప్రయాణం మరింత సాఫీగా, సౌకర్యవంతంగా, ఆస్వాదించే విధంగా ఉంటుంది.
  • భద్రత విషయంలో సియట్ రన్-ఫ్లాట్ టైరు (RFT) ఓ వినూత్నమైన ఆవిష్కరణ.
  • పంక్చర్ అయిన తర్వాత కూడా చెప్పుకోదగ్గ వేగంతో వాహనం ముందుకు వెళ్లేందుకు ఇది తోడ్పడుతుంది.
  • హై-ఎండ్ సెడాన్లు, ఎస్‌యూవీలకు అదనపు భద్రత, విశ్వసనీయతను అందించే విధంగా ఇది ఉంటుంది.
  • ప్రెసిషన్ ఇంజినీరింగ్‌లో పటిష్టమైన వారసత్వంతో పాటు వినియోగదారుల అవసరాలపై లోతైన అవగాహన కలిగి ఉన్నందున పరిశ్రమలోనే తొలిసారిగా ఈ ఉత్పత్తులను సియట్ అభివృద్ధి చేసింది.
  • భారతీయ, అంతర్జాతీయ మార్కెట్లలోను హై-వేల్యూ లగ్జరీ సెగ్మెంట్లో తన కార్యకలాపాలను విస్తృతం చేసుకోవాలన్న సియట్ లక్ష్యానికి ఈ ప్రీమియం టైర్ టెక్నాలజీలు ఉపయోగపడనున్నాయి.