Club Mahindra | ఆంధ్రప్రదేశ్, అబుదాబి, వియత్నాంలో క్లబ్ మహీంద్రా సరికొత్త రిసార్ట్‌లు

  • By: TAAZ    news    May 20, 2025 4:01 PM IST
Club Mahindra | ఆంధ్రప్రదేశ్, అబుదాబి, వియత్నాంలో క్లబ్ మహీంద్రా సరికొత్త రిసార్ట్‌లు

Club Mahindra | ప్రముఖ హాస్పిటాలిటీ సంస్థ మహీంద్రా హాలిడేస్ అండ్ రిసార్ట్స్ ఇండియా లిమిటెడ్ (MHRIL) ఫ్లాగ్‌షిప్ బ్రాండ్ క్లబ్ మహీంద్రా, తమ పోర్ట్‌ఫోలియోకు మూడు కొత్త రిసార్ట్‌లను జోడించింది. దేశీయంగా, అంతర్జాతీయంగా తమ ఉనికిని విస్తరిస్తూ, ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా అడుగు పెట్టింది. వియత్నాంలోని సైగాన్ ప్రాంతంలో రిచ్‌లేన్ రెసిడెన్సెస్, అబుదాబిలోని హాలిడే ఇన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా తమ కార్యకలాపాలను మరింత విస్తరించింది. ఈ విస్తరణతో సభ్యులకు విభిన్న గమ్యస్థానాలను, అద్భుతమైన సెలవుల అనుభవాలను అందించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

గోదావరి తీరాన రమణీయమైన డిండి ఆర్‌వీఆర్

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో, గోదావరి నది ఒడ్డున దండి ఆర్‌వీఆర్ రిసార్ట్ ఉంది. అందమైన కొబ్బరి తోటలు, ఆకట్టుకొనే బ్యాక్‌వాటర్స్‌తో చుట్టుముట్టినట్టు ఉండే ఈ రిసార్ట్.. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో విశ్రాంతి తీసుకోవడానికి ఎంతో అనుకూలమైన ప్రదేశం. ఈ రిసార్ట్‌లో 100 సువిశాల గదులు ఉన్నాయి. మొదటి దశలో 50 గదులు ఏప్రిల్ 2025లో క్లబ్ మహీంద్రా సభ్యులకు అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన 50 గదులతో కూడిన రెండో దశ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రారంభం కానుంది.

అబుదాబి, వియత్నాంలో అంతర్జాతీయ విస్తరణ

అబుదాబిలోని హాలిడే ఇన్‌, వియత్నాంలోని హో చి మిన్ సిటీలో ఉన్న రిచ్‌లేన్ రెసిడెన్సెస్, ఈ రెండు నగరాల సందడిగా ఉండే ప్రాంతాలకు, పర్యాటక ఆకర్షణలకు దగ్గరగా ఉన్నాయి. ఈ రెండు ప్రాపర్టీలు అత్యాధునిక సౌకర్యాలను అందిస్తాయి. సభ్యులకు మరపురాని బసను అందిస్తాయి.

FY30 నాటికి గదుల సామర్థ్యం రెట్టింపు చేయడమే లక్ష్యం

మహీంద్రా హాలిడేస్ అండ్ రిసార్ట్స్ ఇండియా ఎండీ, సీఈవో మనోజ్ భట్ మాట్లాడుతూ, డిండిలోని తమ కొత్త రిసార్ట్ ఆంధ్రప్రదేశ్‌లో తమ ప్రవేశానికి సంకేతమన్నారు. రాష్ట్రంలో పర్యాటకాన్ని పెంచడానికి తమ నిబద్ధతను ఇది చాటుతన్నదని చెప్పారు. ఆర్‌వీఆర్ డిండి రాష్ట్రంలో తాము ప్లాన్ చేసిన పెట్టుబడులలో మొదటిదని తెలిపారు. అదనంగా, వియత్నాం, అబుదాబిలో తమ విస్తరణతో అంతర్జాతీయంగా తమ ఉనికిని పెంచుకుంటున్నామని చెప్పారు. ఈ విస్తరణ FY30 నాటికి మా గదుల సామర్థ్యాన్ని 10,000కు రెట్టింపు చేయాలనే తమ వ్యూహాత్మక లక్ష్యంతో సరిపోలుతున్నదని అన్నారు. తమ కొత్త ఆఫర్‌లు సౌకర్యం, సాహసం, సాంస్కృతిక అనుభూతుల కలయికను అందిస్తాయని చెప్పారు. ’మా సభ్యులకు మరిన్ని ఎంపికలను అందిస్తాం, వారి సెలవుల అనుభవాలను మరింత మెరుగుపరుస్తాం. క్లబ్ మహీంద్రాతో మరపురాని జ్ఞాపకాలను సృష్టిస్తాం” అని ఆయన అన్నారు. ఈ మూడు కొత్త రిసార్ట్‌లు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందిస్తాయి. వీటిలో రుచికరమైన మెనూ, హాయిని అందించే స్పా సేవలు, లీనమయ్యే సాంస్కృతిక, సాహస కార్యకలాపాలు ఉన్నాయి. ప్రశాంతమైన నదీ తీర విశ్రాంతి నుంచి సందడిగా ఉండే నగర దృశ్యాల వరకు, ఈ రిసార్ట్‌లు క్లబ్ మహీంద్రా సభ్యులకు అసాధారణమైన అనుభవాలను అందించడానికి రూపొందించబడ్డాయి. ఈ మూడు ప్రాపర్టీలు ఏప్రిల్ 15 నుండి సభ్యులకు అందుబాటులోకి వచ్చాయి.