మోగిన‌ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల న‌గారా.. ఆప్‌కి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన ఎస్పీ

  • By: sr    news    Jan 07, 2025 9:48 PM IST
మోగిన‌ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల న‌గారా..  ఆప్‌కి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన ఎస్పీ

మ‌రోసారి దేశంలో ఎన్నిక‌ల న‌గారా మోగింది. రెండు నెలల క్రితం మ‌హారాష్ట్ర‌, జార్కండ్ అసెంబ్లీ ఎన్నిక‌లు ముగియ‌గా ఇప్పుడు దేశ రాజ‌ధాని ఢిల్లీ ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ మంగ‌ళ‌వారం వివ‌రాలు వెళ్ల‌డించి మొత్తం 70 స్థానాల‌కు ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. 70 స్థానాలకు ఫిబ్రవరి 5న ఒకే దశలో ఓటింగ్ నిర్వహించి, ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరుగుతుందని, ఢిల్లీ వ్యాప్తంగా 13,033 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇక త‌క్ష‌ణ‌మే ఢిల్లీలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తున్న‌ట్లుస్ప‌ష్టం చేశారు.

ఎన్నిక‌ల‌కు సంబ‌ధించి ఈనెల 10వ తేదీన నోటిఫికేషన్‌ విడుదలవ‌నుంది. నామినేషన్లకు జనవరి 17వ తేదీ వరకు గడువు ఉండ‌గా, 18న నామినేషన్ల పరిశీలన, 20వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియ‌నుంది. ఆపై ఫిబ్రవరి 5న ఎన్నిక‌లు, ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు ఉండ‌నుంది.

ఢిల్లీలో మొత్తంగా 1.55 కోట్ల ఓటర్లు ఉండ‌గా వారిలో 83.49 లక్షల పురుష ఓటర్లు, 71.74 లక్షల మహిళా ఓటర్లు ఉన్నారు. అందులో 25.89 లక్షల మంది యువ ఓటర్లు ఉన్నట్లు ప్ర‌క‌టించారు. ఇదిలాఉండ‌గా ఎన్నిక‌ల షెడ్యూల్ వ‌చ్చిన కాసేప‌ట్లోనే.. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అధినేత అఖిలేశ్ యాదవ్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి మద్ధతు ప్రకటించి హాట్ టాపిక్ అయ్యారు. బీజేపీని ఓడించే పార్టీకే తమ మద్దతు ఉంటుందన్న అఖిలేశ్ ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతుగా ఢిల్లీలో సభ కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు.