సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన.. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య!

  • By: sr    news    Mar 18, 2025 5:51 PM IST
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన.. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య!

Gummadi Narsaiah| Cm Revanth Reddy

విధాత: గిరిజన నాయకుడు, కమ్యూనిస్టు యోధుడు, ఇల్లందు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని అసెంబ్లీలోని వారి ఛాంబర్‌లో గుమ్మడి నర్సయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. తన నియోజకవర్గంలోని సమస్యలపై ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి నర్సయ్య వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మంత్రులు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కలు ఉన్నారు.

గత ఫిబ్రవరి నెలలో గుమ్మడి నర్సయ్య సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు వచ్చిన సందర్భంలో సీఎం ఇంటి ముందు ఎండలో గంటల తరబడి నిలబడి ఎదురుచూసిన ఘటన అప్పట్లో వైరల్ గా మారింది. ఐదుసార్లు ఎమ్మెల్యే నర్సయ్యను సీఎం సెక్యురిటీ సిబ్బంది సీఎంను కలిసేందుకు అనుమతించకపోవడం వివాదస్పదమైంది. అదే సమయంలో సీఎం తన కాన్వాయ్ లో బయటకు వెలుతు గుమ్మడి నర్సయ్యను చూసి గుర్తు పట్టకుండా వెళ్లిపోవడం కూడా విమర్శలకు తావిచ్చింది.

గత సీఎం కేసీఆర్ గద్దర్ ను, ఇప్పుడు రేవంత్ రెడ్డి నిరాడంబరతకు మారుపేరైన గుమ్మడి నర్సయ్యను ఎండలో గంటల పాటు నిలబెట్టి అవమానించారంటూ విమర్శలు రేగాయి. అయితే గుమ్మడి నర్సయ్య ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా సీఎం వద్ధకు వెళ్లడం.. నిరాడాంబరంగా ఉండే ఆయనను సెక్యురిటీ సిబ్బంది గుర్తించలేక పోవడం సమస్యకు దారి తీసిందని అప్పట్లో సీఎంవో వర్గాలు వివరణ ఇచ్చాయి. చివరకు దాదాపు నెల రోజుల తర్వాతా గుమ్మడి నర్సయ్యకు సీఎం రేవంత్ రెడ్డి క‌ల‌వ‌డంతో ఈ వివాదస్పద ఎసిసోడ్ కు తెర పడింది.