ఇస్రో మాజీ చైర్మన్.. కస్తూరి రంగన్ కన్నుమూత

  • By: sr    news    Apr 25, 2025 3:34 PM IST
ఇస్రో మాజీ చైర్మన్.. కస్తూరి రంగన్ కన్నుమూత

బెంగళూరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మాజీ చైర్మన్‌ డాక్టర్‌ కృష్ణస్వామి కస్తూరి రంగన్ కన్నుమూశారు. శుక్రవారం ఉదయం ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. కస్తూరిరంగన్‌ 1990-1994 వరకు యూఆర్‌ఏసీ డైరెక్టర్‌గా పనిచేశారు. అనంతరం ఆయన 9 ఏళ్లపాటు (1994-2003) ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన హయాంలో ఇస్రో తొలి లూనార్ మిషన్‌కు అడుగులు పడ్డాయి. జేఎన్‌యూ చాన్స్‌లర్‌గా, కర్ణాటక నాలెడ్జ్‌ కమిషన్‌ చైర్మన్‌గా కస్తూరి రంగన్‌ పనిచేశారు.

2003-09 మధ్య రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు. అంతేకాకుండా ప్రణాళికా సంఘం సభ్యుడిగానూ సేవలందించారు. 2004 నుంచి 2009 మధ్య కాలంలో బెంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌కు డైరెక్టర్‌గా పనిచేశారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా పనిచేశారు. ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.